
పుట్టి, పెరిగింది స్వీడన్లో. కానీ వాళ్ల మనసంతా ఎప్పుడూ బాలీవుడ్ పైనే ఉండేది. షారుక్ ఖాన్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ’ సినిమా చూసి ఎప్పటికైనా బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నారు. ముంబై వచ్చేశారు. బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబై వీధులన్నీ తిరిగారు. ఎక్కడా ఛాన్స్ దొరకలేదు. అయినా సరే, బాలీవుడ్ ను వదిలేది లేదని ‘టు ఫారెనర్స్ ఇన్ బాలీవుడ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. ముంబైలో వీళ్లు పడే అవస్థలన్నింటినీ వీడియోలుగా తీసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. బాలీవుడ్ యాక్టర్స్ గా ఏమో గానీ ఇండియాలో ట్రెండింగ్ యూట్యూబ్ స్టార్స్ గా మాత్రం ఎదిగారు.
బాలీవుడ్ పై వాళ్లకున్న ఇష్టమే హాంపస్, జోహాన్‌లను యూట్యూబ్ స్టార్స్‌గా మార్చింది. నిజాయితీగా వాళ్లు పెట్టిన ఎఫర్ట్ కోట్ల మందికి రీచ్ అయింది. ఈ ఛానెల్లో ముంబైలో ఇద్దరి ఫారెనర్స్ లైఫ్ ఎంత హిలేరియస్‌గా ఉంటుందో చూపిస్తారు. ట్రాఫిక్‌లో రోడ్డు దాటడం కోసం పడే తిప్పలు, ఆటోవాలాతో ఆడే బేరాలు ఇలా డైలీ లైఫ్‌ను ఫన్నీగా చూపించేలా ఉంటాయి వీళ్ల వీడియోలన్నీ.
ఇలా మొదలైంది
హాంపస్, జోహాన్లు బాలీవుడ్ యాక్టర్స్ అవుదామని ముంబై వచ్చారు. ఎంత తిరిగినా ఎక్కడా అవకాశం రాలేదు. తిరిగి వెళ్లిపోవడం ఇష్టంలేక ఇక్కడే ఉంటూ ట్రై చేద్దాం అనుకున్నారు. అలా ముంబైలో మకాం వేశారు. ముంబై సిటీ లైఫ్ వాళ్లకు కొత్తగా అనిపించింది. సిటీలో రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందుల నుంచే వాళ్లకో ఐడియా వచ్చింది. ‘ముంబైలో ఉండే ఇబ్బందులను సరదాగా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తే బాగుంటుంద’ని. వెంటనే ‘2 ఫారెనర్స్ ఇన్ బాలీవుడ్’ పేరుతో ఒక ఫేస్ బుక్ పేజీ మొదలుపెట్టారు. పేజీ అయితే మొదలుపెట్టారు. కానీ, ప్రొఫెషనల్‌గా వీడియోలు ఎలా తీయాలో తెలియలేదు. హిందీ రాదు. ముంబై గురించి అంతగా తెలియదు. దాంతో వీళ్లకు మరొక లోకల్ వ్యక్తి అవసరం ఏర్పడింది. సరిగ్గా ఆ టైంలో వీళ్లకు విధాన్ ప్రతాప్ పరిచయమయ్యాడు. అతని సాయంతో చిన్న చిన్న వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఆ షార్ట్ వీడియోలకు మిలియన్ల వ్యూస్ రావడంతో 2016లో ‘2 ఫారెనర్స్ ఇన్ బాలీవుడ్’ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టారు.
హిందీ నేర్చుకుని మరీ..
యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాక 2016 లో ముగ్గురూ కలిసి అంథేరిలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. హాంపస్, జోహాన్లు రోజూ సాయంత్రం హిందీ క్లాసులకు వెళ్లేవాళ్లు. మిగతా టైంలో యూట్యూబ్ కంటెంట్ పై వర్క్ చేసేవాళ్లు. రియల్ లైఫ్‌లో జరిగే సంఘటనలనే కంటెంట్‌గా ఎంచుకోవాలనుకున్నారు. ముంబై అంతా తిరిగి సిటీ లైఫ్‌ను స్టడీ చేశారు. సిటీలో అందరూ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్‌ను సరదాగా చూపించేలా ఐడియా, స్క్రిప్ట్ రెడీ చేసుకునేవాళ్లు. ఆ తర్వాత లొకేషన్‌కు వెళ్లి షూటింగ్ చేసేవాళ్లు. హాంపస్, జోహాన్ వీడియోల్లో నటిస్తుంటే విధాన్ వాటిని షూట్ చేసేవాడు.
కల నిజమైంది
బేరం ఆడుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోయే ఆటోవాలా, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో చెయ్యి అడ్డుపెట్టి దర్జాగా రోడ్డు దాటే వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ వీళ్లు చేసిన వీడియోలు వ్యూయర్స్‌ను బాగా ఎంటర్టైన్ చేశాయి. దాంతో ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్, లక్షల్లో కామెంట్లు వచ్చేవి. చూస్తుండగానే ‘2 ఫారెనర్స్ ఇన్ బాలీవుడ్’ ఒక బ్రాండ్‌గా మారింది. అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయమంటూ వెంటపడ్డాయి. కొన్ని యాడ్స్ చేశారు కూడా. అలా ఈ ఇద్దరు ఫారెనర్స్ ముంబైలో బాగా పాపులర్ అయ్యారు. అంతేకాదు వాళ్లు కలగన్న రోజు రానే వచ్చింది. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. రంగూన్(2017), రుస్తుం(2016), బంజో(2016) సినిమాల్లో నటించారు.
పాజిటివ్ కామెంట్లే ఎక్కువ
టీనేజ్‌లో ఉన్నప్పుడు ‘దిల్ వాలే..’ లాంటి సినిమాలు చూసి బాలీవుడ్ పై మనసు పారేసుకున్నామని, అందుకే ముంబై వచ్చామని చెప్తుంటారు హాంపస్, జోహాన్ లు. అవకాశాలు వచ్చినా, రాకపోయినా యూట్యూబ్ జీవితం సంతృప్తినిచ్చిందని చెప్తున్నారు. అందుకే వీళ్ల ఛానెల్లో ఎలాంటి స్పాన్సర్డ్ వీడియోలు అప్ లోడ్ చేయరు. ఎంటర్ టెయిన్ చేస్తే చాలనుకుంటారు. వీళ్ల వీడియోల్లో 99 శాతం పాజిటివ్ కామెంట్లే వస్తాయంటే వ్యూయర్స్ కు వీళ్ల కంటెంట్ ఎంతగా నచ్చుతుందో అర్థం చేసుకోవచ్చు.
నెట్ వర్త్
‘2 ఫారెనర్స్ ఇన్ బాలీవుడ్’ యూట్యూబ్ ఛానెల్‌కు 6.5 మిలియన్ల సబ్ స్క్రయిబర్లు, ఇన్ స్టాగ్రామ్ లో 8.4 లక్షల ఫాలోవర్లు, ఫేస్ బుక్ పేజీకి 8.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఛానెల్ నెట్ వర్త్ సుమారు 3.12 మిలియన డాలర్లు. వీళ్ల ఛానెల్ లో ఇప్పటివరకూ 49 వీడియోలు అప్ లోడ్ చేస్తే అందులో 2 మిలియన్లకు తక్కువ వ్యూస్ ఉన్న వీడియో ఒక్కటీ లేదు. ఈ ఛానెల్ లో అత్యంత తక్కువగా ఒక వీడియోకు 2.1 మిలియన్ వ్యూస్ వస్తే.. హయ్యెస్ట్ వ్యూస్ 100 మిలియన్లు వచ్చాయి.