హనుమకొండ కలెక్టరేట్/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: జిల్లాలో బడిబాట కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాల పురోగతిపై హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్, ఎంఈవోలతో రివ్యూ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కనీసం పది శాతం పెరిగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. గ్రామస్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులు, మండల అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు.
దూరప్రాంతాల నుంచి స్కూల్ కు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అందిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ సౌకర్యం చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు గృహాల లెక్కింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ప్రశాంత్‌నగర్, అశోక్ కాలనీ, సిద్ధార్థ్‌నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ప్రాంతాల్లో నిర్మించిన భవనాల కొలతలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. నిబంధనలు పాటిస్తేనే సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పారు.
