
- చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్
చండూరు (గట్టుప్పల్), వెలుగు : జియో ట్యాగ్ కలిగి ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత కార్మిక మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. చేనేత సహకార సంఘంలో నిల్వ ఉన్న వస్త్రాలను ధాన్యం తరహాలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
ఇప్పటికే నేసిన వస్త్రాలు సంఘాల్లో పేరుకుపోవడం వల్ల చేనేత కార్మికులు పని లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని, మార్కెట్లో ఉన్న ప్రింటెడ్ చీరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
చేనేత కార్మికులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, చేనేత కేంద్రాల్లో యారన్ డిపోలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు కర్నాటి మల్లేశం, కర్ణాటి వెంకటేశం, కందగట్ల గణేశ్, భావండ్ల ఆంజనేయులు, చెరుపల్లి సత్యనారాయణ, పున్న కిశోర్, అందెం రాములు, చెరుపల్లి కృష్ణయ్య, మందుల శంకర్, కర్నాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.