చండూర్ మండలంలో చేనేత కార్మికుల ఆందోళన

చండూర్ మండలంలో చేనేత కార్మికుల ఆందోళన

నల్గొండ జిల్లా :- మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. వరంగల్ తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..?
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా రెండు రోజుల క్రితం ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా పద్మశాలి కుటుంబానికి చెందిన ఓ నేతన్న ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే నరేందర్.. మగ్గంపై కాలు పెట్టారు. మగ్గంపై ఎమ్మెల్యే కాలు పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పద్మశాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ మనోభావాలను ఎమ్మెల్యే నరేందర్ దెబ్బతీశారంటూ నేతన్నలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలుచోట్ల ఎమ్మెల్యే నరేందర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తాజాగా చండూర్ మండలంలో చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు జీవనాధారమైన మగ్గంపై కాలు పెట్టి... ఎమ్మెల్యే అవమానించారని, వెంటనే తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మగ్గాన్ని తాము చాలా పవిత్రంగా భావిస్తామని, అలాంటి మగ్గంపై ఎమ్మెల్యే నరేందర్ కాలు పెట్టి తమ మనోభావాలను కించపర్చాడంటూ పద్మశాలీలు మండిపడ్డారు. ఉప ఎన్నిక  ప్రచారంలో ఎమ్మెల్యే నరేందర్ చేనేత మగ్గంపై కాలు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ.. ‘నేతన్నలను ఆదుకుందాం’ అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోస్ట్ కార్డ్ యుద్ధం మొదలుపెట్టింది. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోడీకి కార్డులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ చేసిన పని రెండు, మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మగ్గంపై కాలు పెట్టి నేతన్నలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అర్థం అవుతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.