ఉపాధి పని ప్రదేశంలో.. కనీస సౌలత్‌‌‌‌‌‌‌‌లు కరువు

ఉపాధి పని ప్రదేశంలో.. కనీస సౌలత్‌‌‌‌‌‌‌‌లు కరువు

హనుమకొండ, వెలుగు  ఎండ తీవ్రతతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో కనీస సౌలత్‌‌‌‌‌‌‌‌లు కల్పించాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. తాగుదామంటే నీళ్లు లేక.. కాసేపు సేదదీరుదామంటే నీడ లేకపోవడంతో కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు కూలీలు వడదెబ్బతో చనిపోయారు. కనీసం ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఎయిడ్‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌ కూడా అందుబాటులో లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

41 డిగ్రీలు దాటిన ఎండ

గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు తమ ప్రతాపం చూపుతున్నాయి. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచే వేడిగాలులు మొదలై వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గతేడాది 40 డిగ్రీలు కూడా దాటని ఉష్ణోగ్రత ప్రస్తుతం 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అవుతోంది. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇదిలాఉంటే వేసవిలో పనులేమీ లేకపోవడంతో చాలా మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. కానీ పని చేసే ప్రదేశంలో ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేక కూలీలు వడదెబ్బ బారిన పడుతున్నారు. మే 15న హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి మండలం సిద్ధాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ముస్కు పెంటు(57) ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురికాగా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్తుండగానే చనిపోయాడు. జూన్​7న ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన కటుకూరి మొగిళి (55) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. 

కనిపించని కనీస వసతులు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,688 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదా పు 7.12 లక్షల జాబ్‌‌‌‌‌‌‌‌కార్డులు ఉండగా, సుమారు 12 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని చట్టం ఉన్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా సరైన ఏర్పాట్లు కనిపించడం లేదు. పని ప్రదేశంలో కూలీలకు నీడ సౌకర్యం కల్పించేందుకు గతంలో ఫీల్డ్​అసిస్టెంట్లకు పంచాయతీ పరిధి, కూలీల సంఖ్యను బట్టి టార్పాలిన్లు, టెంట్లు అందజేశారు. కానీ ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదు. కూలీలకు ఎండదెబ్బకు గురికాకుండా ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్లు, నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. 

గావర అయితాంది 

రెండు నెలల నుంచి 100 రోజుల పనికి వస్తన్న. పొద్దుగాల 8 కాకముందే ఎండ సుర్రుమంటుంది. కాసేపు కూసుందామంటే ఎక్కడా నీడ ఉంటలేదు.  తాగడానికి నీళ్లు కూడా ఉంటలేవు. మేం తెచ్చుకున్న నీళ్లు కూడా ఎండకు వేడెక్కుతున్నయ్. కొద్దిసేపు పనిచేయంగనే పాణమంతా గావరైంతంది. ఇంత కష్టం చేస్తున్నా రోజుకు రూ. 100 కూడా వస్తలేదు.

గొర్రె ఇద్దయ్య, ఇందిరానగర్, ఎల్కతుర్తి

ఉదయమే పూర్తి చేయాలని చెప్తున్నం 

ఎండ తీవ్రత కారణంగా ఉదయం 9 లోపే పనులు పూర్తి చేయాలని చెబుతున్నాం. ఆరేడు ఏండ్ల కింద వచ్చిన టార్పాలిన్లు, టెంట్లు ఫీల్డ్​అసిస్టెంట్లకు ఇచ్చినం. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. పని ప్రదేశంలో నీడ సౌకర్యం కల్పించాలని చెప్తున్నాం. ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నం. 

ఆకవరం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఆర్డీవో