సర్కార్​ నుంచి బిల్లులు రాక మనస్తాపంతో.. మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య

సర్కార్​ నుంచి బిల్లులు రాక మనస్తాపంతో.. మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య
  • హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో ఘటన
  • ఐదారేండ్ల కిందట పంచాయతీ బిల్డింగ్ పనులు చేసిన చంద్రయ్య
  • రూ.8 లక్షల దాకా పెండింగ్‌‌లో పెట్టిన సర్కారు
  • 20 గుంటలను అమ్మినా అప్పు తీరకపోవడంతో మనోవేదన
  • ఖర్చు చేసిన వివరాలు రాసిపెట్టి.. ఉరేసుకుని బలవన్మరణం

భీమదేవరపల్లి, వెలుగు: ఐదారేండ్ల కిందట చేసిన పనులకు బిల్లులు రాక, తెచ్చిన అప్పులకు మిత్తి కట్టలేక మనోవేదనకు గురై అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ అభివృద్ధికి చేసిన ఖర్చుల వివరాలను రాసి, తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుందీ ఘటన. 

..మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య

కొత్తపల్లికి చెందిన రేణిగుంట్ల భాగ్య.. తెలంగాణ ఏర్పడ్డాక సర్పంచ్​గా ఎన్నికైంది. ఆమె భర్త రేణిగుంట్ల చంద్రయ్య (50) అన్ని పనులూ చూసుకునేవాడు. గ్రామంలో రూ.13 లక్షల అంచనా వ్యయంతో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి  ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. 2017లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తర్వాత అప్పు తెచ్చి స్లాబ్ లెవల్ వరకు పనులు చేశారు. ఇందుకు గతంలో మొదటి దఫా  రూ.3 లక్షలు రిలీజ్​ కాగా.. ఇంకో రూ.8 లక్షల వరకు రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు పైసా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే పిల్లల చదువు కోసం మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. పంచాయతీ పనుల కోసం పెట్టిన పెట్టుబడులు రాకపోవడం, వ్యవసాయంలో ఆదాయం లేకపోవడంతో అప్పుల భారం ఎక్కువైంది.

రికార్డుల్లో ఆలస్యం వల్లే

చంద్రయ్య దుస్తుల్లో కొంత నగదు, ఒక చీటి లభించాయి. తాను గ్రామ పంచాయతీకి పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పుల వివరాలు, ప్రస్తుత సర్పంచ్​తో కలిసి పెట్టిన పెట్టుబడి వివరాలను చిట్టీలో రాశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్.. చంద్రయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘పంచాయతీ బకాయిల కోసం ఇదివరకు కొంతమంది మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్‌‌లో మెసేజ్‌లు పెట్టారు. దీంతో వెంటనే కేటీఆర్ స్పందించి అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేశారు. కానీ కొత్తపల్లి పంచాయతీకి సంబంధించిన పనుల విషయంలో ఎంబీలు రికార్డు చేయడంలో ఆలస్యం జరిగింది. అందుకే  నగదు జమ కాలేదు. ఒక ధైర్యవంతుడిని కోల్పోవడం బాధాకరం” అని సతీశ్ కుమార్ చెప్పారు.

ప్రభుత్వంపై దుష్ప్రచారం: స్థానిక నేతలు

మరోవైపు స్థానిక జడ్పీటీసీ సభ్యుడు వంగ రవి, ఎంపీపీ అనిత మండల సర్వసభ్య సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. చేసిన పనులకు ఎంబీ రికార్డ్ చేయడంలో సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. చంద్రయ్య ఆత్మహత్యకు కుటుంబంలో ఉన్న అంతర్గత గొడవలు కూడా కారణమని అన్నారు. చంద్రయ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు.

మిత్తీల భారం పెరగడంతో..

అప్పులు తీర్చడానికని తనకున్న రెండెకరాల భూమిలో 20 గుంటలను ఆరు నెలల కిందట చంద్రయ్య అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో కొంతమేర అప్పులు తీర్చాడు. మిగతా అప్పులకు సంబంధించిన మిత్తీల భారం పెరగడం, ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఇదే విషయాన్ని తరచూ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పుకొని బాధపడ్డాడు. మూడు రోజుల కిందట ముల్కనూర్ సొసైటీలో కొంత అప్పు తీసుకొన్నాడు. అయినా అప్పులు తీర్చేందుకు సరిపోక ఆందోళన చెందాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తన పొలం వద్ద వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రయ్య కొడుకు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ముల్కనూరు ఎస్సై మహేందర్ తెలిపారు.