మే 22న జపాలిలో హనుమాన్ జయంతి వేడుకలు..జపాలి ఎక్కడుంది పేరు ఎలా వచ్చింది.?

 మే 22న జపాలిలో హనుమాన్ జయంతి వేడుకలు..జపాలి ఎక్కడుంది పేరు ఎలా వచ్చింది.?

తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, శ్రీనివాసుడని, గోవింధుడని, 
బాలాజీ అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా నోరారా పిలుచుకుంటారు భక్తులు. తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పరిసర ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు భక్తులు. ఏడు కొండలపై ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన తిరుమల క్షేత్రం, కేవలం ఆధ్యాత్మికంగానే కాదు కనువిందు చేసే ప్రకృతి అందాలకు కొదవ లేదు.  ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా మందికి అక్కడ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలియదు. అంతేకాకుండా తిరుమలకు కొత్తగా వెళ్లే వారు, అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనదే జపాలి తీర్థం..

తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహద్వారానికి, అఖిలాండానికి ఎదురుగా బేడీ ఆంజనేయస్వామి దేవాలయం ఉంటుంది. రెండు చేతులు అంజలి ఘటించి వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. త్రేతాయుగంలో రామబద్రునికి సేవ చేసిన హనుమంతుడు.., కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులార స్వామి వారిని వీక్షిస్తూ.. స్వామి వారికి సేవ చేస్తున్నాడు హనుమంతుడు. భగవంతునికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయానికంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. ఇక త్రేతాయుగంలో బాల హనుమ.. ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని వీడేంత పనిచేసాడట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుని కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు వేసిందట. కలియుగం ప్రారంభం నుంచి.. వరాహ స్వామి, శ్రీవారికి నైవేద్యం సమర్పణ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారికీ నైవేద్య సమర్పణ జరుగుతోందని స్థల పురాణం చెబుతోంది.

తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగ 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అరణ్యంలో జాపాలి తీర్థం ఉంది. జాపాలి మహర్షి శ్రీరాముని కోసం తపస్సు చేసిన ప్రాంతం ఇది అని చెబుతారు. ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడని పురాణం. ఇక్కడి జాబాలి తీర్థంలో స్నానం చేసిన భక్తులు పాపాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఏడుకొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమనీ, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమనీ పేర్లు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతారు. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటీ ఉన్నాయి. ఇక్కడి రామ తీర్థంలో ఏడు మంగళవారాలు స్నానం ఆచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల  నమ్మకం.

జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలసి శ్రీ వేంకటేశ్వరునికి సేవలు చేసేవార‌ట. శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి, ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. ఈ విధంగా తిరుమల కొండపైన 108 పుణ్యతీర్దాలు ఉండగా అందులో ఒకటిగా ప్రసిద్ధి చెందిన, హనుమంతుడు స్వయంభువుగా వెలసిన జాపాలి తీర్థం.  ఈ తీర్థంలో స్నానమాచరించి హనుమంతుడిని దర్శనం చేసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం హథీరాంజీ మఠం మహంతుల పాలనలోనే కొనసాగుతోంది. ప్రతి ఏటా జపాలిలో హనుమాన్ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు..