ఆనంద మార్గం

ఆనంద మార్గం

తన కోపమె తన శత్రువు 
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ! 
అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన.

ఇందులో నాలుగు అంశాలను పొందుపరిచాడు. మూడో వాక్యంతో తన సంతోషమె తనకు స్వర్గం అంటాడు. అంటే తాను సంతోషంగా ఉంటే తనకే స్వర్గం లభిస్తుంది. తన స్వర్గాన్ని తాను సంతోషంగా ఉండటం ద్వారా సంపాదించుకోవచ్చునని సుమతీ శతకం చెప్తుంది. ‘సంతోషం అతిసులువుగా, బహు చవగ్గా దొరుకుతుంది’ అని ఉషశ్రీ తన ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళిలో చెప్పారు. 

‘సంతోషం సగం బలం’ అని మనకు సామెత ఉంది. సంతోషాన్ని విడిచి పెట్టి దుఃఖంలో మునిగిపోతే ఆ వ్యక్తి ఎందులోనూ విజయం సాధించలేకపోగా, అనారోగ్యాలు కొనితెచ్చుకుంటాడు. ఆరోగ్యం కోసం ఇటీవల ‘సంతోషం థెరపీ’ కూడా అనుసరిస్తున్నారు. ఉదయాన్నే సూర్యుడికి ఎదురుగా నిలబడి, పెద్దగా, కడుపునిండుగా నవ్వుతున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలోని నాడులన్నీ ఉత్తేజితమై, ఉత్సాహంగా పనిచేస్తాయి. మనసుల్ని పరిశుభ్రం చేస్తాయి.

‘ఉత్సాహం సర్వ సిద్ధులకూ మూలం. అప్రతిహత పరాక్రమ ప్రదర్శనకు ఉత్సాహమే ప్రధానం’ అంటాడు రామాయణంలో లక్ష్మణుడితో రాముడు. సీతాపహరణం జరిగిన తరువాత సీత కోసం అన్వేషిస్తూ రాముడు విలపిస్తుంటాడు. ఆ సమయంలో రామునికి ఉపశమనం కలిగిస్తుంటాడు లక్ష్మణుడు. మనసు కుదుట పడిన తరువాత తమ్ముడితో ‘‘మనకు ఏది సిద్ధించాలన్నా ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహం కావాలంటే సంతోషంగా ఉండాలి. అలాగే పరాక్రమాన్ని ప్రదర్శించటానికి కూడా ఉత్సాహం తప్పనిసరి. సంతోషం ద్వారా ఆ ఉత్సాహం చేకూరుతుంది” అని చెప్తాడు రాముడు. ఆ ఉత్సాహంతోనే రావణుడి మీదకి దండెత్తి రాముడు విజయం సాధించాడు. నిరుత్సాహంతో, దుఃఖంతో విలపిస్తూ కూర్చుని ఉంటే, రావణ సంహారం జరిగేది కాదు. 
రాముడికే కాదు... ఒకానొక సమయంలో హనుమంతుడు సీతమ్మ వారి జాడ తెలియక, ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు. ఆ సమయంలో ఆయనలో దుఃఖం పొరలు తొలగిపోయాయి. రెట్టింపు ఉత్సాహంతో సీతమ్మను కనిపెట్టాడు. సంతోష సాగరంలో తేలియాడాడు. సంతోషంతోనే కార్యసిద్ధి జరుగుతుందని తెలుసుకున్నాడు. సంతోషంగా ఉంటే అంత బలం చేకూరుతుంది. సంతోషంగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి. ‘నవ్వుతూ బతకాలిరా, నవ్వుతూ చావాలిరా’ అన్నాడు ఓ సినీ కవి. ‘ఆనందం... అమృత వర్షం’ అన్నాడు ఓ వాగ్గేయకారుడు. ‘ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే’ అన్నాడు శ్రీశ్రీ. ‘ఆనందమే జీవిత మకరందం’ అన్నాడు మరో సినీ కవి. హృదయంలో నిరంతరం ధైర్యం, ఉత్సాహం ఉండాలి. ఆపదలో సైతం ధైర్యాన్ని వీడని వాడే ఉత్తముడు... అంటాడు వాల్మీకి. 
*   *   *
ఒక ఊళ్లో ఒక కుందేలు ఉండేది. అది ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేది. ఆ కుందేలును చూసిన మిగతా జంతువులకు ఈర్ష్యగా ఉండేది. ‘ఈ కుందేలు ఎప్పుడు చూసినా నవ్వుతూ సంతోషంగానే కనిపిస్తుంది. దీనికసలు బాధలు లేవా’ అని 

వాటిలో అవి చర్చించుకునేవి. కుందేలు నిత్యం ఎందుకు సంతోషంగా ఉండగలుగుతోందో తెలుసుకోవాలనుకుని, ఒకరోజు కుందేలు దగ్గరకు వెళ్లి, ‘నువ్వు నిత్యం సంతోషంగా ఉంటావు. అందుకు కారణం ఏమిటి?’ అని ప్రశ్నించాయి. అందుకు ఆ కుందేలు నవ్వుతూనే, ‘దుఃఖం కలిగినప్పుడు కూడా సంతోషంగా ఉంటేనే.. మనకు ఆరోగ్యం కలుగుతుంది. దుఃఖం వచ్చింది కదా అని ఏడవటం వల్ల మనకు ఎటువంటి మేలు జరగదు. అందుకే ఏ ఆపద వచ్చినా, దుఃఖం కలిగినా నేను సంతోషంగా ఉండటం అలవాటు చేసుకున్నా. అందుకే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతున్నా’ అంటుంది. 

‘దుఃఖం కలిగినప్పుడు ఏడుపు వస్తుంది కదా. నవ్వుతూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు?’ అని అవి వాటి సందేహాన్ని వెలిబుచ్చాయి. అప్పుడు ఆ కుందేలు, ‘మీరన్న మాట నిజమే. ఏదైనా చెడు జరిగినప్పుడు నాకు కూడా ఒక్క క్షణం దుఃఖం కలుగుతుంది. కళ్లలో నీళ్లు చిప్పిల్లుతాయి. అంతలోనే, ‘తన సంతోషమె స్వర్గము’ అనే వాక్యాన్ని గుర్తు చేసుకుంటా. పదిసార్లు మననం చేసుకుంటా. అంతే వెంటనే బాధ మరచిపోయి, సంతోషంగా ఉండటం మొదలుపెడతా. ఇది ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇది ఎంతో సాధన మీద అలవడింది. అందుకే నిరంతరం నేను సంతోషంగా ఉండగలుగుతున్నా’ అంది చిరునవ్వుతో.

ఆ మాటలు విన్న జంతువులన్నిటికీ ఆశ్చర్యంగా అనిపించింది. అవి కూడా సాధన చేయాలనుకున్నాయి. సంతోషంగా ఉంటే బలం చేకూరుతుందని తెలుసుకున్నాయి. రోజురోజుకీ మన సంతోష నిల్వలు పెంచుకోవాలంటారు వేదాంతులు. ‘నవ్వుతూ బతకాలి’ అని చెప్తారు. ఎంతో సాధన చేస్తేనే సంతోషంగా ఉండగలుగుతామని కూడా పెద్దలు చెప్తారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని తెలిసిందే కదా.

-  డా. వైజయంతి పురాణపండ