
పాపన్నపేట, వెలుగు : మనుషుల బర్త్ డేలు చేసినం.పెంపుడు జంతువుల పుట్టిన రోజులు చూసినం. కానీ ఊరికి పుట్టిన రోజు చేయడం చూశారా..? అయితే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామానికి వెళ్లాల్సిందే. ఈ ఊరికి ప్రతి ఏటా సంక్రాంతి రోజు బర్త్డే వేడుకలు నిర్వహిస్తారు. 75 ఏండ్ల కింద ఆంధ్ర నుంచి కొంత మంది పాపన్నపేట మండలానికి వలస వచ్చి కెనాల్ పక్కన ఉంటూ ఆ ప్రాంతానికి లక్ష్మీనగర్ అని పేరు పెట్టుకున్నారు. 1200 జనాభా ఉన్న లక్ష్మీనగర్ 1995లో గ్రామ పంచాయతీగా మారింది. గ్రామస్తులందరూ కలిసి ఊరిని అభివృద్ధి చేసుకున్నారు. 2014లో లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం గురించి అందరికీ తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు. ఈసారి ఊరి 75వ పుట్టినరోజు కావడంతో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. పెద్ద ఎత్తున్న బోగి మంటలు వేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కబడ్డీ, ఖోఖో, పతంగుల పోటీలు పెట్టి పండుగ రోజే బహుమతులు అందజేలా ఏర్పాట్లు చేశారు. ఊళ్లో వాళ్లంతా ఒకదగ్గరికి చేరి భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే ‘లక్ష్మీనగర్’ అంటూ సంబురాలు చేసుకుంటారు.