భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పరిపాలన దక్షత 78 సంవత్సరాలు గడిచినా నేటికీ మార్గదర్శకమే. పవిత్ర రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యం కోసం పరితపించిన ఆయన ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. నెహ్రూ భారత దేశ ఆధునిక రూపశిల్పిగా నిలిచారు. స్వాతంత్య్రం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి నాడు ఎంతో జాగ్రత్తతో వేసిన అడుగులే ఇప్పుడు దేశానికి బాటలుగా మారాయి. దూరదృష్టితో ఆర్థికంగా, సామాజికంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలకు చెందిన ఫలితాలను ఇప్పుడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం నిలవాలంటే అత్యంత శక్తిమంతమైన ప్రధానమంత్రి పదవి సమర్థవంతమైన నాయకుడి చేతిలో ఉంటేనే దేశప్రగతి, భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ తలంపుతోనే మహాత్మా గాంధీ దేశ తొలి ప్రధానిగా నెహ్రూకు ప్రాధాన్యతిచ్చారు. గాంధీ ఆశయాలను వమ్ము చేయకుండా దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారు నెహ్రూ 1964 మే 27 వరకు మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రజలందరికీ సమానత్వం కల్పిస్తూ సోష లిజానికి పెద్దపీట వేసి సుపరిపాలన అందించారు.
నెహ్రూ హయాంలో ఐఐటీలు, ఐఐఎంలు
‘పెట్టుబడిదారి శక్తులను అదుపు చేయకపోతే సమాజంలో ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతారు.’ అనే భావనతో నెహ్రూ సామ్యవాదానికి ప్రాధాన్యతిస్తే ఇప్పుడు మోదీ ప్రభుత్వం పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను వారికి దోచిపెడుతోంది. నెహ్రూ పాలనలో దేశంలో పరిశ్రమల అభివృద్ధికి ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్, ఎస్ఏఐఎల్ సంస్థలను ప్రారంభించారు. రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి డీఆర్డీఓ, ఇస్రో స్థాపించిన నెహ్రూ ప్రభుత్వం 1948లోనే అణుశక్తి కార్యక్రమానికి పునాది వేసింది. దేశంలో విద్యా ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో నెహ్రూ ప్రభుత్వం ఖరగ్ పూర్, బొంబాయి, మద్రాస్‌లో ఐఐటీలను, కలకత్తా, అహ్మదాబాద్ లో ఐఐఎంలను, ఢిల్లీలో ఎయిమ్స్ స్థాపించింది. విదేశాంగ వ్యవహారాల్లో నెహ్రూ అవలంబించిన విధానం దేశానికి ఇప్పటికీ రక్షణ కవచంగా నిలుస్తోంది. విదేశాంగ విధానంలో నెహ్రూ ప్రారంభించిన ‘అలీన విధానం’ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆయన చైనాతో కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం నేటికీ భారత్ కు ప్రయోజనకరంగా ఉంది. నెహ్రూ 1960లో సిరియాలో పర్యటించినప్పుడు ఆయనను చూడడానికి విమానాశ్రయానికి పదివేల మందికిపైగా తరలివచ్చి ‘ప్రపంచ శాంతి వీరుడికి స్వాగతం’ అని నినాదాలు చేశారని అక్కడి పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించడం దేశానికే గర్వకారణం.
బీజేపీ పాలనలో పెరిగిన నిరుద్యోగం
మూడు దఫాలుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెరిగింది. జీఎస్టీ పన్నులతో ధరలు పెరిగాయి. కుల, మత ప్రాంతాల వైషమ్యాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు బీజేపీ బృందం అవాస్తవాలతో నెహ్రూ లక్ష్యంగా విమర్శలు ప్రారంభించింది. దేశ తొలి కేబినెట్లో నెంబరు టూ అయిన హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, నెహ్రూకు మధ్య విభేదాలున్నట్టు బీజేపీ తప్పుడు ప్రకటనలు చేస్తోంది. గాంధీ, నెహ్రూ, పటేల్ మధ్య ఉన్న అనుబంధం, అవగాహన, నిబద్ధతతోనే స్వతంత్ర భారత దేశ తొలి ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. దేశ విభజన, కశ్మీర్, ఆర్టికల్ 370, చైనాతో యుద్ధం వంటి అంశాలపై కూడా బీజేపీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా నెహ్రూ, పటేల్ మధ్య విభేదాలున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తోంది.
ఎన్నికల వ్యవస్థ కలుషితం
11ఏండ్లకు పైగా దేశాన్ని పరిపాలిస్తున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థలను ఉసి గొల్పుతోంది. ఓటర్ల జాబితా మొదలుకొని పూర్తి ఎన్నికల వ్యవస్థనే భ్రష్టుపట్టిస్తోంది. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలు రుజువులను బహిర్గతం చేసినా అధికార పార్టీ ఒత్తిడికి లొంగుతున్న ఎన్నికల కమిషన్ నుండి సానుకూల స్పందన కరువైంది. లోక్ సభలో 1952 మే 22వ తేదీన జవహర్ లాల్ నెహ్రూ మాట్లాడుతూ ‘ఏ ప్రభుత్వంలోనైనా విమర్శకులు, ప్రతిపక్షాలు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది’ అని తెలిపారు.
ప్రతిపక్షాలకు సమప్రాధాన్యత ఇవ్వాలి
‘సభలో ప్రతిపక్షాలకు సమప్రాధాన్యతతో అవకాశాలిస్తేనే వారిచ్చే నిర్మాణాత్మక సూచనలు దేశ అభివృద్ధికి తోడ్పడుతాయి.’ అని ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పడంలో నెహ్రూ హుందాతనం కనిపిస్తోంది. అదే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ‘దేశ ద్రోహులు’ అనే ముద్ర వేస్తున్నారు.
పిల్లలను అమితంగా ప్రేమించే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన పిల్లలనే కాదు దేశ ప్రజలదంరినీ తమ బిడ్డలుగానే భావించి సుపరిపాలన అందించారు. 16 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న నెహ్రూ దేశాభివృద్ధి కోసం పరితపిస్తూ అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి వివక్ష లేని పాలన కోసం సామ్యవాదాన్ని అనుసరించారు. ఆయన పాలనను మార్గదర్శకంగా తీసుకుంటే దేశానికి హితం జరుగుతుంది.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
