- సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ఫైర్
నిజామాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికి సీఎం కేసీఆర్ మైనారిటీలకు గాలం వేస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ అదే వెనుకబాటుతనంలో ఉన్న మైనారిటీలకు కేవలం రూ.లక్ష మాత్రమే ఇవ్వడాన్ని గమనించాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడానికి తాను ఈ సంగతి ప్రస్తావిస్తున్నట్టు చెప్పారు.
మంగళవారం రాత్రి నగరంలోని మార్వడీ మంచ్‌లో ఆయన మాట్లాడారు.. అవినీతి, అహంభావంతో కవిత ఓటమి చెందారన్నారు. వచ్చే ఎలక్షన్లలో తాను ఎక్కడ పోటీ చేసినా బీఆర్ఎస్ పెద్దలే తన వెనుకరావాలని, గెలిచి తన సత్తా ఏమిటో చూపుతానన్నారు. ఎలక్షన్లో పోటీ చేసే కాంగ్రెస్ క్యాండిడెట్ల బీ ఫారాలు మార్కెట్లో దొరుకుతాయని ఆయన ఎద్దేవా చేశారు. కష్టపడేవారికి మాత్రమే బీజేపీలో టికెట్లు ఇస్తారన్నారు.
కొన్ని కాంగ్రెస్ మీడియా చానళ్లు బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని ప్రచారం చేస్తూ ఒకరిద్దరూ బీజేపీ లీడర్లను మాత్రం ఎత్తుతూ రాజకీయం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, స్రవంతిరెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, లింగం, రోషన్‌లాల్, శ్యాంసుందర్ అగర్వాల్, సీతారామ్పాండే, నారాయణ అటల్, తివారీ తదితరులు పాల్గొన్నారు.