క్రికెట్‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌ ఇచ్చిన హర్భజన్‌‌‌‌

క్రికెట్‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌ ఇచ్చిన హర్భజన్‌‌‌‌

23 ఏళ్ల లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌.. 100 టెస్టులు ..200 వన్డేలు.. 700 పైచిలుకు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ వికెట్లు.. రెండు వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ విక్టరీలు.. మూడు ఫార్మాట్లలో టీమిండియా సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాత్ర.. టెస్టుల్లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ తీసిన ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు..! 

సచిన్‌‌‌‌‌‌‌‌‌‌, గంగూలీ, ద్రవిడ్‌‌‌‌‌‌‌‌, కుంబ్లే హయాం నుంచి ఎంఎస్‌‌‌‌‌‌‌‌ ధోనీ, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ జమానా వరకూ  హవా చూపెట్టి..  ఆఫ్‌‌‌‌‌‌‌‌–స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్‌‌‌‌‌‌‌‌తో ఇండియా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను కట్టి పడేసి.. ‘దూస్రా’లతో ఆపొజిట్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌పై కత్తి దూసి.. అప్పుడప్పుడు బ్యాట్‌‌‌‌‌‌‌‌తో దంచికొట్టి.. తప్పు అనిపిస్తే టీమ్‌‌‌‌‌‌‌‌మేట్‌‌‌‌‌‌‌‌నే చెంప దెబ్బలు కొట్టిన ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ హర్భజన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఆటకు టాటా చెప్పాడు..! 

భిన్నమైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌, అంతకంటే వైవిధ్యమైన వ్యక్తిత్వంతో..  విజయాలతో పాటు వివాదాల్లోనూ ముందు నిలిచిన భజ్జీ 41 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించాడు..! ఇకపై ‘దూస్రా లైఫ్‌‌‌‌‌‌‌‌’ను స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు చెప్పిన ఈ టర్బోనేటర్‌‌‌‌‌‌‌‌ తనకు అన్నీ ఇచ్చిన క్రికెట్‌‌‌‌‌‌‌‌కు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు..! జలంధర్‌‌‌‌‌‌‌‌లో పుట్టి.. ఎన్నో ఎత్తు పల్లాలను చూసి..  టీమిండియా టర్బోనేటర్‌‌‌‌‌‌‌‌గా మారిన హర్భజన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌  అసలైన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌!

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌)

స్పిన్నర్లు అంటే స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించే పిచ్‌‌‌‌‌‌‌‌లపై మాత్రమే వికెట్లు తీసేవాళ్లు కాదని, టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటే ఎక్కడైనా సత్తా చాటొచ్చని నిరూపించిన ఘనత హర్భజన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కే దక్కుతుంది. ఈ ఒక్కదాంట్లోనే కాదు భజ్జీ అన్నింటా స్పెషలే. తన ఆట, మాట, చేష్టలు అన్నీ వైవిధ్యమే. మ్యాచ్​–ఫిక్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉదంతం తర్వాత  2000 దశాబ్దంలో సౌరవ్‌‌‌‌‌‌‌‌ గంగూలీ కెప్టెన్సీలో ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ సరికొత్త ప్రయాణంలో హర్భజన్‌‌‌‌‌‌‌‌ కూడా కీలకమే. 1998లో టెస్టు, వన్డే  డెబ్యూ చేసినప్పటికీ భజ్జీ స్టార్‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌ తెచ్చుకుంది మాత్రం 2001లోనే. ఆ ఏడాది 2001 మార్చిలో -ఆస్ట్రేలియాపై హిస్టారికల్‌‌‌‌‌‌‌‌ టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌ విక్టరీ ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌తోపాటు భజ్జీ కెరీర్‌‌‌‌‌‌‌‌లోనూ మోస్ట్‌‌‌‌‌‌‌‌ మెమొరబుల్. మూడు టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టిన తను.. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ తీసిన (కోల్‌‌‌‌‌‌‌‌కతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో)  ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు. అప్పుడే భజ్జీ.. టర్బోనేటర్ అయ్యాడు. టర్బన్‌‌‌‌‌‌‌‌ (తలపాగా) ధరించిన బౌలర్‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియాను టర్మినేట్‌‌‌‌‌‌‌‌ (పడగొట్టాడు) చేశాడంటూ ఓ ఆసీస్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ హర్భజన్‌‌‌‌‌‌‌‌ను ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ టర్బోనేటర్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. అప్పటి నుంచి అదే నిక్‌‌‌‌‌‌‌‌ నేమ్‌‌‌‌‌‌‌‌ అయింది.  ఆ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు బ్యాక్‌‌‌‌‌‌‌‌బోన్‌‌‌‌‌‌‌‌లాంటి రికీ పాంటింగ్‌‌‌‌‌‌‌‌ను భజ్జీ ఏకంగా ఐదుసార్లు ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ తర్వాత కూడా పాంటింగ్‌‌‌‌‌‌‌‌కు సింహస్వప్నమయ్యాడు. టెస్టుల్లో అతడిని డజను సార్లు ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. పాంటింగ్‌‌‌‌‌‌‌‌ ఒక్కడనే కాదు.. అప్పటి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ గ్రేట్స్‌‌‌‌‌‌‌‌ అయిన హేడెన్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌క్రిస్ట్‌‌‌‌‌‌‌‌, డామిన్‌‌‌‌‌‌‌‌ మార్టిన్‌‌‌‌‌‌‌‌, స్టీవ్‌‌‌‌‌‌‌‌వా, కలిస్‌‌‌‌‌‌‌‌, ఫ్లింటాఫ్‌‌‌‌‌‌‌‌ అందరికీ సవాల్‌‌‌‌‌‌‌‌ విసిరాడు. ముఖ్యంగా విదేశాల్లో భజ్జీ చెలరేగాడు. స్పిన్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్ ఇవ్వని సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటాడు. అలాగే, చాలా మ్యాచ్​ల్లో బ్యాట్​తోనూ రాణించాడు. టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా కొట్టాడు.  

అదే స్పెషాలిటీ..

హర్భజన్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో 2001–2011 బెస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌. సొంతగడ్డపై టెస్టుల్లో కుంబ్లే, హర్భజన్ ఇండియా బెస్ట్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ పెయిర్​గా మారారు.  అయితే, ఈ పదేళ్లలో ఇండియా  పూర్తిగా స్పిన్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌లపై టెస్టులు ఆడిన సందర్భాలు అరుదు. పైగా ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో టెస్టుల్లో చాలా గొప్ప బ్యాటర్లున్నారు. అయినా హర్భజన్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ సాధించడానికి కారణం తన బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్పెషాలిటీనే.  పిచ్‌‌‌‌‌‌‌‌ నుంచి  అనూహ్యమైన బౌన్స్‌‌‌‌‌‌‌‌, పేస్‌‌‌‌‌‌‌‌ జనరేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. అలాగే, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌  స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ సక్లయిన్‌‌‌‌‌‌‌‌ ముస్తాక్‌‌‌‌‌‌‌‌ను చూసి నేర్చుకున్న దూస్రాకు ఇంకొంత వైవిధ్యం జోడించిన భజ్జీ దాన్ని తన బిగ్గెస్ట్ వెపన్‌‌‌‌‌‌‌‌గా మార్చుకున్నాడు. ఇక, 2007–2011 మధ్య హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గ్యారీ కిర్‌‌‌‌‌‌‌‌స్టన్‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌లో హర్భజన్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన వైట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా మారాడు. ఈ క్రమంలో 2007 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌, 2011 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ విక్టరీల్లో పాలు పంచుకున్నాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లోనూ 150 వికెట్లు పడగొట్టి బెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే, 2011–2016  మధ్య భజ్జీ కెరీర్‌‌‌‌‌‌‌‌ గ్రాఫ్‌‌‌‌‌‌‌‌ పడిపోయింది. గాయాలు, ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోవడంతో పాటు అశ్విన్‌‌‌‌‌‌‌‌ హవాలో టీమ్‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌ కోల్పోయాడు. వాస్తవానికి 2016లోనే ఇండియాకు తన చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడాడు.  అయితే, వీడ్కోలు మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగించాలని చాన్నాళ్లు ఎదురు చూసిన భజ్జీకి  ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ రాకపోవడం ఒక్కటే లోటు. ఏదేమైనా ఇండియన్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఓ ఇంట్రస్టింగ్​ చాప్టర్​ ముగిసింది. 

వివాదాల్లోనూ ముందే..

ఇండియా విజయాలతో పాటు వివాదాల్లోనూ హర్భజన్‌‌‌‌‌‌‌‌‌‌ ముందుండేవాడు. గ్రెగ్‌‌‌‌‌‌‌‌ చాపెల్‌‌‌‌‌‌‌‌–గంగూలీ వివాదంలో  దాదాకు బహిరంగంగా సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఏకైక క్రికెటర్‌‌‌‌‌‌‌‌ తను. తాను నమ్మిన దాని కోసం  ఎంతదూరమైన వెళ్లే భజ్జీ.. ఓసారి నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అకాడమీలో ఫుడ్‌‌‌‌‌‌‌‌ బాగాలేదని ప్రొటెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో అప్పటి ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ చీఫ్‌‌‌‌‌‌‌‌ హనుమంత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌.. అతడిని అకాడమీ నుంచి బయటకు పంపేశాడు. 2008 ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌లో  ‘మంకీగేట్’ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్​ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌ను స్టేడియంలోనే చెంపదెబ్బ కొట్టి బ్యాన్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కోవడం  భజ్జీ కెరీర్‌‌‌‌‌‌‌‌లో చేదు జ్ఞాపకాలు. హర్భజన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌పై కూడా  ప్రశ్నలు, విమర్శలు వచ్చాయి. రెండుసార్లు టెస్టుకు వెళ్లి  క్లీన్‌‌‌‌‌‌‌‌గా తిరిగొచ్చాడు.

అసంతృప్తి లేదు

నా జీవితానికి సర్వం ఇచ్చిన ఆటకు ఈ రోజు నేను వీడ్కోలు చెబుతున్నా. 23 ఏళ్ల ఈ ప్రయాణాన్ని అందంగా, గుర్తుండిపోయేలా మార్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌. అందరు క్రికెటర్ల మాదిరిగా నేను కూడా ఇండియన్‌‌‌‌‌‌‌‌ జెర్సీలో గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పాలనుకున్నా. కానీ, విధి రాత మరోలా ఉంది. నేను ఏ జట్టుకు ఆడినా.. నా వంద శాతం కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చా. వెనక్కితిరిగి చూసుకుంటే కెరీర్​లో  ఎలాంటి అసంతృప్తి లేదు. నేను కోల్పోయిన దానికంటే ఎక్కువే సాధించా. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో ఏం చేస్తానో ప్రస్తుతానికైతే  ఐడియా లేదు.   కానీ, నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం క్రికెట్టే. మున్ముందు ఏ పాత్రలోనైనా ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌కు సేవ చేసే అవకాశం దొరికితే సంతోషిస్తా.  సొసైటీకి కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. ఒకవేళ పాలిటిక్స్​లో జాయిన్​ అవ్వాలనుకుంటే చాలా విషయాలు ఆలోచించాలి. ఏదేమైనా ఇప్పుడు కొత్త సవాళ్లతో నేను కొత్త జీవితాన్ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశా. నన్ను నమ్మండి, మీ టర్బోనేటర్‌‌‌‌‌‌‌‌ పరీక్షకు రెడీగా ఉన్నాడు! ’

‑ హర్భజన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌

ఇంటర్నేషనల్​ కెరీర్‌‌‌‌

ఫార్మాట్‌‌‌‌    మ్యాచ్​లు    వికెట్లు      బెస్ట్‌‌‌‌

టెస్టులు         103               417        15/217

వన్డేలు            236               227        5/31

టీ20లు            28                  27        4/12