ఎవరిపైనైనా పార్టీ నిర్ణయం ప్రకారమే చర్యలు ..నా వల్ల బీఆర్ఎస్‌‌కు నష్టం జరగడమన్నది వట్టిమాటలే!: హరీశ్‌‌రావు

ఎవరిపైనైనా  పార్టీ నిర్ణయం ప్రకారమే చర్యలు ..నా వల్ల బీఆర్ఎస్‌‌కు నష్టం జరగడమన్నది వట్టిమాటలే!: హరీశ్‌‌రావు
  • కవిత ఎపిసోడ్​పై లండన్​లో సన్నిహితుల వద్ద  హరీశ్ రావు స్పందన
  • నేను క్రమశిక్షణ గల కార్యకర్తను 
  • లండన్​ ఎన్నారై సెల్​ మీట్​ అండ్​ గ్రీట్​ కార్యక్రమానికి హాజరు

హైదరాబాద్​, వెలుగు:  బీఆర్ఎస్​ పార్టీకి తన వల్ల నష్టం జరుగుతుందనడం ఒట్టిమాటలేనని, తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని మాజీ మంత్రి హరీశ్‌‌రావు పేర్కొన్నారు. పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్​ అడుగుజాడల్లోనే నడిచానని, భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తానని తెలిపారు. తన కూతురును కాలేజీలో జాయిన్​ చేసేందుకు లండన్​ వెళ్లిన ఆయన.. కవిత ఎపిసోడ్‌‌పై తన సన్నిహితుల వద్ద ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆమె చేసిన వ్యాఖ్యలను సీరియస్​గా తీసుకోబోనని చెప్పినట్టు సమాచారం. 

బీఆర్ఎస్​లో కేసీఆర్​ సుప్రీం అని, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఏ నిర్ణయం తీసుకోవాలన్న పార్టీ విధివిధానాల ప్రకారమే జరుగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, లండన్​ టూర్​ ముగించుకొని శనివారం హైదరాబాద్‌‌కు హరీశ్‌‌రావు  తిరిగిరానున్నారు.   

రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగింది

లండన్‌‌లో బీఆర్‌‌ఎస్​ ఎన్నారై సెల్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్​ అండ్​ గ్రీట్​ కార్యక్రమంలో హరీశ్‌‌రావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని పేర్కొన్నారు. బెంగాల్​ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని ఒకప్పుడు చెప్పుకునే వారని, కానీ, కేసీఆర్​పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనేలా మారిందని చెప్పారు. 

రాష్ట్రంలో ఇప్పుడు ఏ శాఖలో చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేటి పాలకులు నెగెటివ్​ మైండ్‌‌సెట్​తో పాలన చేస్తున్నారని, అలాంటప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం పర్ఫార్మెన్స్‌‌పై దృష్టి పెట్టకుండా గూగుల్​ ప్రచారంపై దృష్టి సారించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

 అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినా.. ఇప్పుడు వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయంటూ పాలకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్న రేవంత్‌‌రెడ్డి.. మల్లన్నసాగర్​ నుంచి 50 టీఎంసీలను మూసీకి తీసుకెళ్తానంటున్నారని విమర్శించారు. 

కాళేశ్వరం కూలిపోతే నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కాళేశ్వరం లేకున్నా రికార్డు పంట పండిందని మంత్రి ఉత్తమ్​ అంటున్నారని, మరి, కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని నిలదీశారు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండానే అంత పంట ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించారు.