ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలి : హరీశ్​రావు

ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలి : హరీశ్​రావు
  • యాసంగి పంటలకు బోనస్  ఇచ్చి కొనుగోలు చేయాలి
  • కరువు నివారణ చర్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకుంటలేదు
  • కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాతే ప్రభుత్వం కళ్లు తెరిచిందని వెల్లడి

సిద్దిపేట/హైదరాబాద్, వెలుగు: వడగండ్ల వానతో దెబ్బతిన్న, నీరందక ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్​ చేశారు. నీటి నిర్వహణ, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలకు నష్టంవాటిల్లుతోందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆయన విమర్శించారు.

రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్నా ప్రభుత్వం కరువును నివారించే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టిన తరువాతనే సర్కారు కళ్లు తెరిచి దిద్దుబాటు చర్యలకు దిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట లభిస్తోందన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రైతాంగ సమస్యలపై కలెక్టర్ కు హరీశ్ రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. యాసంగి పంటలకు బోనస్  ఇచ్చి కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ.15 వేలు  రైతులతో పాటు కౌలు రైతులకూ ఇవ్వాలన్నారు. కూడవెల్లి వాగులోకి 24 గంటల్లో నీళ్లు విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మల్లన్నసాగర్ ను  ముట్టడిస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దీనిపై జోకులు వేస్తున్నారని హరీశ్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుల ఇండ్లల్లోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ధ రైతులకు నీళ్లిచ్చే విషయంలో పెడితే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ రైతుల పక్షమేనని అన్నారు. వారి పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగడం శోచనీయమన్నారు. సీఎం మమ్మల్ని విమర్శించడం మానుకొని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. జడ్పీచైర్ పర్సన్ రోజాశర్మతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

పాడి రైతులకు పాల బకాయిలు చెల్లించాలి

విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు పెండింగ్‌‌‌‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని హరీశ్​ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదన్నారు. 45రోజులకు గాను దాదాపు రూ.80 కోట్లు ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగు బిల్లున్నీ ఒకేసారి విడుదల చేయాలని ఆయన కోరారు.