బెంగళూరు: జట్టులో వెటరన్ పేసర్ జులన్ గోస్వామి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. 39 ఏండ్ల జులన్ సెప్టెంబర్ 24న లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలకనుంది. ఇంగ్లండ్ టూర్‌కు బయల్దేరే ముందు మంగళవారం హర్మన్ మీడియాతో మాట్లాడుతూ జులన్‌పై ప్రశంసలు కురిపించింది. 2009 వరల్డ్‌కప్‌లో జులన్ కెప్టెన్సీలోనే తాను పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశానని గుర్తు చేసుకుంది. ఇప్పుడు జులన్ చివరి మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉండటం తన అదృష్టమని అభిప్రాయపడింది.
‘నేను జట్టులోకి వచ్చినప్పుడు జులన్ ముందుండి నడిపించింది. క్రికెటర్‌గా, ఒక వ్యక్తిగా నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. జులన్ ఆడే చివరి మాకు కూడా ఇది స్పెషలే. తను ప్రత్యేక జ్ఞాపకాలతో వీడ్కోలు పలికే ప్రయత్నం చేస్తాం’ అని హర్మన్ చెప్పుకొచ్చింది. కాగా, సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఈ టూర్‌లో భాగంగా ఇండియా ఆతిథ్య ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది.
