తెలంగాణ యువతలో తీవ్ర నిరాశ: బండారు దత్తాత్రేయ

తెలంగాణ యువతలో తీవ్ర నిరాశ: బండారు దత్తాత్రేయ
  • లిక్కర్​ కారణంగా  కుటుంబాలు ఛిద్రం
  • సామాజిక తెలంగాణ ఏర్పడాలి 
  • హర్యానా గవర్నర్​  బండారు దత్తాత్రేయ

యాదాద్రి, వెలుగు : తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు గడుస్తున్నా యువత, మహిళలు నిరాశలో ఉన్నారని హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత, సమాన హక్కులు లేక మహిళలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. లిక్కర్​ కారణంగా తమ కుటుంబాలు ఛిద్రమవుతున్నాయన్న ఆవేదన మహిళల్లో ఉందన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి నిర్వహించిన 'తెలంగాణ ఉద్యమకారుల అలయ్​-బలయ్​ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన సెటైర్లు విసిరారు. బంగారు తెలంగాణ అంటే.. స్వచ్ఛమైన బంగారమే ఉండాలి కానీ, కల్తీ ఉండవద్దన్నారు.

తెలంగాణ స్వచ్ఛంగా, శుద్ధిగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం 2002లో ప్రారంభం కాలేదని, 1950 నుంచి సాగుతోందన్నారు. విభేదాలు ఉండవచ్చు.. విమర్శలు చేయవచ్చు కానీ శతృత్వం ఉండకూడదన్నారు. శతృత్వం వల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ప్రభుత్వం కారణంగానే.. అభివృద్ధి జరిగిందనుకుంటే పొరపాటన్నారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం నడిచిందని ఆయన తెలిపారు. రక్తంతోనే తెలంగాణ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణ ఏర్పడాలని, అన్ని వర్గాలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. వెనుకబడిన తెలంగాణ వద్దని చెప్పిన దత్తాత్రేయ,  దేశంలోనే తెలంగాణ నెంబర్​వన్​గా నిలవాలన్నారు. 

తొమ్మిదేండ్లలోనే.. వందేండ్ల దోపిడీ

తొమ్మిదేండ్లలోనే వందేండ్లకు సరిపోయేంత సంపదను దోచుకున్న కేసీఆర్​, తెలంగాణ తొలిదొంగ అని పలువురు వక్తలు అన్నారు. పెట్టుబడిదారుల కోసమే కేసీఆర్​ పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేసిండని విమర్శించారు. ధరణి ప్రజల కొంపలు ముంచిందన్నారు. సముద్రం లెక్క ప్రజలు ప్రశాంతంగా  ఉన్నారని, ఎన్నికల సమయంలో తుఫానులా విరచుకుపడి కేసీఆర్​ను దించేస్తారన్నారు. కేసీఆర్​ రెండోసారి అధికారంలోకి రాగానే కేసీఆర్​ అసలు స్వరూపం బయటపడిందన్నారు.

ప్రగతి భవన్​ కేసీఆర్​ సొత్తు కాదన్నారు. ప్రగతి భవన్​ గేటు పగలగొట్టి.. ప్రవేశిస్తామని తెలిపారు. నక్సలైట్లు ఉండి ఉంటే.. కేసీఆర్​ ఆటలు సాగకపోయేవని కామెంట్​ చేశారు. అమరుల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య తెలంగాణ సాకారం కావాలంటే.. మరోసారి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అలయ్​-బలయ్​లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే నగేశ్​, కరీంనగర్​ మాజీ జడ్పీ చైర్​పర్సన్​ తుల ఉమ, రాణి రుద్రమ, ఏపూరి సోమన్న, బండ్రు శోభారాణి మాట్లాడారు.