జెండా విక్రయిస్తేనే రేషన్ సరుకులు...

జెండా విక్రయిస్తేనే రేషన్ సరుకులు...

దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కానీ కొందరు అధికారులు మాత్రం ఈ ఉద్యమాన్ని తప్పుపట్టిస్తున్నారు. హరియాణాలోని ఓ రేషన్  డీలర్.. రేషన్ సరుకులతో పాటు రూ.20 పెట్టి జాతీయ పతాకాన్ని కూడా విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా రేషన్‌తో కూడిన జాతీయ జెండాను కొనుగోలు చేయాలని రేషన్ డీలర్ ప్రజలను బలవంతం చేశారు. ఈ ఘటన హేమ్డా గ్రామంలోని పీడీఎస్ దుకాణంలో జరిగింది. రూ.20 పెట్టి జెండాను కొంటేనే సరుకులు ఇస్తామని ఆ డీలర్.. జనాలను ఇబ్బందులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి.. ఆ రేషన్ డీలర్ లైసెన్స్ ను రద్దు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు... ఇష్టం ఉన్నవారే జెండాలు కొనుగోలు చేయాలని.. బలవంతమేమీ లేదని తెలిపారు. బలవంతంగా జెండాలు కొనుగోలు చేపిస్తున్నట్టు తెలుసుకొని.. ఆ రేషన్ డీలర్ లైసెన్స్ ను రద్దు చేసినట్టు కర్నాల్ డిప్యూటీ కమిషనర్ అనీష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై భాజపా ఎంపీ వరుణ్  గాంధీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్  చేశారు. 75వ స్వాతంత్ర్య వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న త్రివర్ణ పతాకాన్ని విక్రయించి... పేదల సొమ్మును లాగేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.