బాధ, సంతోషం.. ఇలా ఏ ఎమోషన్ వచ్చినా కొంత మంది మద్యం ప్రియులు వైన్ షాప్ బాటపట్టేస్తారు. చుక్క పడితే ఆ కిక్కే వేరంటుంటారు. చిల్డ్ బీర్ ఉంటే ఆ మజానే ఎందులోనూ దొరకదంటారు కొందరు మద్యం ప్రియులు. అయితే ఓ వెబ్ సైట్‌లో వచ్చిన న్యూస్ చదివితే వామ్మో బీరా అంటారేమో. బడ్వైజర్ బీర్ తయారీ యూనిట్‌లో పని చేసే ఒక ఉద్యోగి బీర్ ట్యాంక్‌లో 12 ఏళ్ల పాటు యూరిన్ పోసేవాడంటే ఆ కథనం సారాంశం. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హూమర్ వెబ్‌సైట్.. ఎక్కడో చివరలో చిన్న నోట్..
అమెరికాలోని కొలరాడోలో ఉన్న అతి పెద్ద బీర్ తయారీ యూనిట్‌లో పని చేసే ఉద్యోగి 12 ఏళ్లపాటు బీర్ ట్యాంకులో యూరిన్ పాస్ చేశాడని, ఈ విషయాన్ని తానే ఒప్పుకొన్నాడని ఫూలిష్ హ్యూమర్ (foolishhumour.com) అనే వెబ్ సైట్ ఓ స్టోరీ రాసింది. ఆ ఉద్యోగి పేరు వాల్టర్ అని, అతడు బడ్వైజర్ బీరు తయారీ ట్యాంకు పైభాగంలో విధులు నిర్వర్తించే టైమ్‌లో యూరిన్ వస్తే టాయ్‌లెట్ వరకు వెళ్లడానికి బద్ధకంతో అందులోనే పోసేసే వాడని ఆ స్టోరీలో పేర్కొంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడని, తన ఫ్రెండ్స్‌లో ఎవరైనా బడ్వైజర్ బీరు తాగుతుంటే నవ్వు ఆపుకోలేకపోయేవాడినని వాల్టర్ తెలిపాడని వివరించింది. అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు చెప్పడంతో ఇకపై అలా చేయనన్నాడని పేర్కొంది. ఈ స్టోరీ ఇప్పుడు ట్వీట్టర్‌లో బడ్వైజర్ హ్యాష్ ట్యాగ్‌తో వైరల్ అవుతోంది. అయితే ఈ సైట్ ఓపెన్ చేసి ఈ స్టోరీ చదివిన వారు.. సైట్ చివరి వరకూ వెళ్తే.. చిన్న అక్షరాలతో రాసి ఉన్న విషయాన్ని చదివితే ఇదంతా ఫేక్ స్టోరీ అని అర్థమైపోయింది. ఫూలిష్ హ్యూమర్ వెబ్ సైట్ నవ్వుకోవడం కోసం సరదా కంటెంట్‌ను అందించే సైట్ అని, దీనిలో స్టోరీస్ అన్నీ ఊహాజనితంగా రాసినవేనని, వీటిలో నిజం లేదని చిన్న అక్షరాల్లో రాసి ఉంటుంది.
