ఎంపీ బరిలో కుమారస్వామి.. మండ్యా నుంచి పోటీ

ఎంపీ బరిలో కుమారస్వామి..  మండ్యా నుంచి పోటీ

జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌.డి.కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మండ్యా పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మండ్యా, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు.  కోలార్ అభ్యర్థిగా మల్లేష్ బాబును ఆయన ప్రకటించారు. 

 మాండ్యా ప్రజల ఒత్తిడి కారణంగానే  తాను  మండ్యా నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు కుమారస్వామి.  2019 లోక్‌సభ ఎన్నికల్లో  మండ్యా పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్  పోటీ చేసి కుమారస్వామి కుమారుడు  నిఖిల్ పై గెలిచారు. మరి ఈ సారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక చన్నపట్న నియోజకవర్గం నుంచి ప్రస్తుతం  ఎమ్మెల్యేగా ఉన్నారు.  

బీజేపీతో కుదిరిన సీట్ల పంపకంలో జేడీ(ఎస్) మూడు స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. హాసన్‌ సిట్టింగ్‌ ఎంపీ, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ పేరును ప్రకటిస్తారని భావించినా, బీజేపీ నేతలు ఆయనను వ్యతిరేకించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది.