క్యూ 2లో అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ

క్యూ 2లో అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ

న్యూ ఢిల్లీ: ఎన్‌‌‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ హౌసింగ్ డెవలప్‌‌మెంట్ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ (హెచ్‌‌డీఎఫ్‌‌సీ)కు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ2) లో రూ. 4,454.24 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన  రూ. 3,780.50 కోట్లతో పోలిస్తే కంపెనీ లాభం ఈసారి 17.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.3,668.82 కోట్లతో పోలిస్తే 21. 4 శాతం ఎగిసింది. ట్యాక్స్‌‌ కింద క్యూ2 లో రూ.960 కోట్లను చెల్లించామని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌ఐఐ) కూడా  ఏడాది ప్రాతిపదికన 12.9 శాతం పెరిగి రూ. 4,639 కోట్లకు చేరుకుందని తెలిపింది.  కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ. 4,110 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ప్రకటించింది. మానిటరీ పాలసీ, వడ్డీ రేట్ల పెంపు ప్రభావం కంపెనీ ఎన్‌‌ఐఐ, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్‌‌ఐఎం) లపై తక్కువగా ఉందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి  హెచ్‌‌డీఎఫ్‌‌సీ అసెట్స్ అండర్ మేనేజ్‌‌మెంట్‌‌ (ఏయూఎం) రూ. 6,90,284 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌ నాటికి ఇది రూ.5,97,339 కోట్లుగా ఉంది.  కంపెనీ ఏయూఎంలో   ఇండివిడ్యువల్‌‌ లోన్ల వాటా 81 శాతంగా ఉంది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  ఇండివిడ్యువల్‌‌ కస్టమర్ల సెగ్మెంట్‌‌లో  లోన్ అప్రూవల్స్‌‌ 35 శాతం పెరిగాయని, డిస్‌‌బర్స్‌‌మెంట్లు 36 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయని కంపెనీ పేర్కొంది.  ఇండివిడ్యువల్  లోన్‌‌ పోర్టుఫోలియోలో గ్రాస్  ఎన్‌‌పీఏల వాటా 0.91 శాతంగా ఉంది.  నాన్ ఇండివిడ్యువల్ లోన్ పోర్టుఫోలియోలో  మొండిబాకీల వాటా 3.99 శాతంగా నమోదయ్యింది.  

మొదటి ఆరు నెలల్లో..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల పెర్ఫార్మెన్స్ చూసుకుంటే హెచ్‌‌‌‌డీఎఫ్‌‌సీ నికర లాభం రూ.8,123 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది ప్రాతిపదికన 20 శాతం గ్రోత్‌‌కు సమానం. మార్కెట్‌‌లు వోలటాలిటీగా ఉండడంతో  కంపెనీ ఈక్విటీ  ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.151 కోట్ల ప్రాఫిట్‌‌ను చూపిస్తున్నాయి.  కిందటేడాది ఇదే టైమ్‌‌లో రూ.548 కోట్ల ప్రాఫిట్‌‌ను స్టాక్ మార్కెట్స్‌‌ నుంచి కంపెనీ సంపాదించింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ  డివిడెండ్ ఇన్‌‌కమ్‌‌ రూ.2,046 కోట్లుగా ఉండగా, ఇన్వెస్ట్‌‌మెంట్లను అమ్మడం ద్వారా రూ.184 కోట్ల ప్రాఫిట్‌‌ను కంపెనీ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సగటున రూ.35.7 లక్షల లోన్‌‌ను ఇచ్చామని, కిందటేడాది ఇదే టైమ్‌‌లో సగటు లోన్ టికెట్ సైజ్‌‌ రూ.33.1 లక్షలుగా ఉందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ వివరించింది.