ఇష్టపడకుంటే తట్టుకోగలరా?

ఇష్టపడకుంటే తట్టుకోగలరా?

నేను మహానుభావుడ్ని, మంచోడ్ని. అందరికీ నా మీద  పాజిటివ్‌‌ ఓపినియన్ ఉండాలె. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను ఒక రేంజ్‌‌లో చూడాలె. నన్ను ఎవరు ఇష్టపడకపోయినా నేను తట్టుకోలేను. నాకు పరిచయమున్న ప్రతి ఒక్కరికీ నేను నచ్చాలె. సోషల్‌‌ మీడియాలో పోస్ట్ పెడితే దానికి ఎవరూ నెగెటివ్‌‌ కామెంట్స్‌‌  పెట్టకూడదన్నంతగా నచ్చాలె. దానికోసం ఏమైనా చేస్త. దేన్నైనా త్యాగం చేస్త’ మహేశ్‌‌ మనసుల అంతరంగం ఇట్లనే మోగుతది. దేన్నైనా అంటే.. ఆస్తి, అంతస్తులనేం త్యాగం చేస్తలేడు కానీ, అంతకన్న ముఖ్యమైన తన సంతోషాన్ని పణంగా పెడుతున్నడు.లోలోపల కుమిలిపోతూనే అందరినీ సంతృప్తి పరచడానికి ట్రై చేస్తున్నడు. తనని ఎవరైనా ఇష్టపడకపోతే దాన్ని తట్టుకునే ధైర్యం లేదా మహేశ్‌‌కి! మరి అంత ధైర్యం మీకుందా?

మనల్ని అందరూ మంచిగా చూడాలి. ఎవరు ఎదురుపడ్డా ‘నువ్వు సూపర్‌‌‌‌‌‌‌‌. గ్రేట్‌‌‌‌’ అనాలి. అందరికీ పాజిటివ్‌‌‌‌ ఓపినియన్‌‌‌‌ ఉండాలి. ఇదే సక్సెస్‌‌‌‌ ఫిలాసఫీ అనుకుంటరు. ప్రతి ఒక్కరూ  మనల్ని‘ ఇష్టపడాలి’, ‘ గౌరవించాలి’ అనేది సాధ్యమయ్యే పనేనా? కానే కాదు. ఎంత గొప్ప పని చేసినా.. ఎక్కడో ఒకచోట మీరు చేసిన పనికి పెదవి విరిచేవాళ్లు ఉంటారు. ‘నేను కరెక్టే చేసినా’ అనుకున్నది వాళ్ల దృష్టిలో తప్పుగా అనిపించొచ్చు. ‘అబ్బా..నేను చేసిన  పని వాళ్లకు నచ్చలేదు. నేను వేసుకున్న షర్ట్‌‌‌‌ బాలేదన్నారు. నేను చేసే జాబ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ అంటున్నారు. మీ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ ఏం బాగుందంటున్నారు’ ఇలా రకరకాల డిజ్‌‌‌‌లైకులు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.


లైక్‌‌‌‌ చేయకుంటే

ఇది కాంప్లెక్స్‌‌‌‌ డిజిటల్‌‌‌‌  ప్రపంచం.  సోషల్‌‌‌‌ మీడియాలో ప్రతి ఒక్కరు ‘లైక్‌‌‌‌’ ల కోసం ఎదురు చూస్తుంటారు. లైక్‌‌‌‌లే కడుపు నింపుతాయన్నంత ఆకలితో ఉంటారు. ఒక్క నెగెటివ్‌‌‌‌ కామెంట్‌‌‌‌ వస్తే రోజుల తరబడి దాని గురించే ఆలోచిస్తారు. ఇది సోషల్‌‌‌‌మీడియాకే పరిమితం కాదు. వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరు తమని లైక్ చేయాలనే చూస్తారు. డిజ్‌‌‌‌లైక్  ఏ రూపంలో ఉన్నా తట్టుకోలేరు. అలాంటి సమయంలో  ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేస్తున్నామనే డౌట్ వెంటాడుతుంటుంది. ‘ఎవరూ డిజ్‌‌‌‌లైక్‌‌‌‌ కొట్టొద్దు. ఎవరూ నన్ను డిజ్‌‌‌‌లైక్ చేయెద్దు’ అని అందరిని సంతృప్తి పరచడానికి ట్రై  చేస్తుంటారు.

అందరినీ సంతృప్తి పరచలేరు

ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచలేమనే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏం చేసినా..అది ఎక్కడో ఒకచోట..  కొంతమందికైనా అసంతృప్తి కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అయినా, మీరు అందరినీ సంతృప్తి పరచడానికి కష్టపడితే.. అది మిమ్మల్ని మీరు కిందపడేసుకోవడానికి మీరే ఒక సెట్టింగ్‌‌‌‌ ఏర్పాటు చేసుకుంటున్నారని అర్థం. మీ పట్ల మీరు నిజాయితీగా ఉంటే చాలు.. ఏది ఎలా ఉన్నా యాక్సెప్ట్‌‌‌‌ చేయగలుగుతారు. నిజం ఏంటో తెలుసుకోగలుగుతారు. ప్రతి విషయంలో అందరూ మీతో ఏకీభవించాలని లేదు. దీన్ని యాక్సెప్ట్‌‌‌‌ చేసినప్పుడు.. మీ లోలోపల పాతుకుపోయిన దుఃఖం, నిరాశ అన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. డిజ్‌‌‌‌లైక్‌‌‌‌ని తట్టుకునే ధైర్యం మీలో నింపుకుంటే.. ఫేక్ ఇగో నుంచి మీకు స్వేచ్ఛ లభించినట్టే! అప్పుడు ఇతరుల లైక్‌‌‌‌, డిజ్‌‌‌‌లైక్‌‌‌‌లను పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు సాగుతారని ‘ది కరేజ్‌‌‌‌ టు బీ డిస్‌‌‌‌లైక్డ్‌‌‌‌’ బుక్‌‌‌‌లో అంటాడు ఇచిరో కిషిమీ.

ఒక్కసారి ఆలోచిస్తే…

మీ ఆరాటానికి, చేసే పోరాటానికి, ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణం మీరు మాత్రమే  అనుకోవద్దు.  మీ సమస్యలతో పాటు.. వేరే వాళ్ల సమస్యలు కూడా మీలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ల సమస్యలు కూడా మిమ్మల్ని డిజ్‌లైక్ చేయడానికి కారణం కావొచ్చు.  మనం కొంచెం ధైర్యంగా ఉంటే..వేరే వాళ్లు మన గురించి ఏం అనుకుంటున్నారో తెలుస్తుంది. అది మన నియంత్రణలో లేనిదని అర్థమవుతుంది. తర్వాత మనం ప్రశాంతమైన దారిలో నడుస్తాం.  మీరు సంతోషంగా ఉండాలంటే ఇంకొకటి కూడా చేయాలి.  ఆల్రెడీ సక్సెస్‌‌‌‌ సాధించిన వాటిని గుర్తు చేసుకుని సెలబ్రేట్‌‌‌‌ చేసుకోవడం ఆపేయాలి.  ‘ఒకరితో పోల్చుకుని జీవించినప్పుడు  మాత్రమే ఇన్‌‌‌‌ఫీరియారిటీ పుడుతుంది. మనల్ని మస్తుమంది లైక్‌‌‌‌ చేయాలి అనే ట్రాప్‌‌‌‌లో పడకండి.  మీ  రోల్‌‌‌‌ మోడల్‌‌‌‌ ఎవరో గుర్తుంచుకుని.. ఆ బాటకు  కట్టుబడి ఉండండి. మీ సంతోషాన్ని స్వయంగా నాశనం చేసిన ప్రతి ఫేక్‌‌‌‌నెస్‌‌‌‌ని దూరం చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరైనా.. మిమ్మల్ని ఇష్టపడకపోతే.. ధైర్యంగా ఎదుర్కోండి. మీ ఆత్మవిశ్వాసం మీద సందేహాలు వద్దు. మీకు మీరుగా ఏర్పరుచుకున్న సరిహద్దులని ధ్వంసం చేసి..  మీరు కోల్పోయిన సంతోషాన్ని  తిరిగి తెచ్చుకునే శక్తి మీలోనే ఉంది’ ఇదే   ‘ది కరేజ్‌‌‌‌ టు బీ డిజ్‌లైక్డ్‌‌‌‌’ ఇచ్చే మెసేజ్‌‌‌‌.