
- కరీంనగర్ పీటీసీలో అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
- రాష్ట్రంలో ఏడు నెలల్లో నలుగురి మరణం
- రిటైర్మెంట్ఏజ్ లో ట్రైనింగ్ పై విమర్శలు
కరీంనగర్ / కరీంనగర్‌క్రైం, వెలుగు: కరీంనగర్ పీటీసీలో ట్రైనింగ్‌కు వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు. ఇదే పీటీసీలో ట్రైనింగ్‌లో ఉండగా ఏడు నెలల్లో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు చనిపోవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన కానిస్టేబుల్ రెడ్డి యుగంధర్(52) నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. ఆయనకు ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. దీంతో కరీంనగర్ పీటీసీలో మే 21న ట్రైనింగ్‌కు వచ్చాడు. ఐదు రోజుల శిక్షణలోనే ఆయన కాళ్లు, చేతులు వాపులు రావడం, కడుపు ఉబ్బడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. తిరిగి ట్రైనింగ్ కు నాలుగు రోజుల కింద మళ్లీ కరీంనగర్ పీటీసీ సెంటర్ కు తన కొడుకు ప్రణీత్ తో వచ్చాడు. అప్పట్నుంచి శిక్షణ పొందుతున్నాడు. మంగళవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కొడుకు ప్రణీత్ అక్కడున్న సిబ్బందికి చెప్పడంతో ప్రభుత్వ దవాఖానాకు తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే చనిపోయాడని చెప్పారు. మృతుడికి భార్య రేణుక, కొడుకు ప్రణీత్, కూతురు నేహా ఉన్నారు. కూతురు నేహా బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. కొడుకు హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏడు నెలల్లో నలుగురు..
పీటీసీలో వరుస మరణాలు.. ట్రైనింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లను కలవరపెడ్తున్నాయి. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్‌సెంటర్ లో నిరుడు నవంబర్ 17న వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజనరేందర్ (50) గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడ్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రాణా సింగ్ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటూ మే 25న గుండెపోటుతో మృతి చెందాడు. తర్వాత 12 రోజులకే రెడ్డి యుగంధర్ చనిపోవడం మిగతా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న వరంగల్ జిల్లా మామునూరు పీటీసీలో ట్రైనింగ్ చేస్తుండగా హైదరాబాద్ నాంపల్లి పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ గుండెపోటుతో చనిపోయాడు. 2017లోనూ కరీంనగర్పీటీసీలో ట్రైనింగ్తీసుకునే క్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన ట్రైనీ ఏఎస్ఐ మీర్జా షమీయుల్లాబేగ్(55), హైదరాబాద్‌లో స్పెషల్రిజర్వ్ సెంట్రల్పోలీస్లైన్(ఎస్ఏఆర్సీపీఎల్) హెడ్‌కానిస్టేబుల్ పి.యాదవరావు (58), ట్రైనీ ఎస్సై శంకర్రావు (53) ఇలాగే అస్వస్థతతో చనిపోయిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
రిటైర్మెంట్ ఏజ్‌లో మాకెందుకీ ‘శిక్ష’ణ
రాష్ట్రంలో ప్రమోషన్ పొందుతున్న కానిస్టేబుళ్లలో 80 శాతం మంది 50 ఏండ్లు దాటినవాళ్లే ఉంటున్నారు. అప్పటికే సర్వీసులో టైమ్‌కు తినక, హెల్త్‌ను పట్టించుకోక 50 ఏండ్ల కే బీపీ, షుగర్ లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడ్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రిటైర్మెంట్ ఏజ్ లో రావడం, ఆ ప్రమోషన్ కన్ఫాం కావాలంటే ట్రైనింగ్కంపల్సరీ కావడంతో ఎంత కష్టమైనా ట్రైనింగ్‌కు వెళ్తున్నారు. ఇలాంటి వారు శిక్షణలో శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉదయం 5.30 గంటలకే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని, శరీరం సహకరించకపోయినా పరేడ్ నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు మాత్రం పోలీస్ మ్యానువల్ ప్రకారం ప్రమోషన్ పొందాలంటే ‘మిడ్ కెరీర్ ట్రైనింగ్’ కంపల్సరీ అని చెప్తున్నారు.