అన్నీ ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ బాధ చెప్పలేనిది. అందుకే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని అన్నారు. కానీ, ప్రస్తుత కల్తీ, కాలుష్య యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తూ ఇల్లు, ఒళ్ళు గుల్ల చేస్తోంది. మరోవైపు ఆధునిక వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా దాని ఫలాలు మాత్రం కొందరికే అందుతున్నాయి. ఈ క్రమంలో అందరికీ అందుబాటులో ఉండే, తేలికగా లభ్యమయ్యే సంప్రదాయ వైద్య విధానాలపై దృష్టి మళ్లింది. వీటిలో ముఖ్యమైనది ఆయుర్వేదం.
వేల ఏళ్లుగా భారతీయ సంప్రదాయ వైద్య విధానంలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఆయుర్వేదంలోని కొన్ని ముఖ్యాంశాల గురించి పండిత్ బైస హరిదాస్ ఆర్య రాసిన పుస్తకమే ‘అందుబాటులో ఆయుర్వేదం.. వంటిల్లే వైద్యశాల’. వేదాలు, ఉపనిషత్తులు, చరక సంహిత, సుశ్రుత సంహిత, సత్యార్థ సంహితము, మను స్మృతి, కొన్ని ఆధునిక పాఠ్య పుస్తకాలు, వైద్య గ్రంథాలను పరిశీలించి, పరిశోధించి ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు రచయిత పేర్కొన్నారు.
మనం తీసుకునే ఆహారంతోపాటు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే చెట్లు, మొక్కలు, ఆకులు, తీగలు, కాయలు, పండ్లు, బెరడ్లు, వేర్లు.. వంటివి మన ఆరోగ్య సంరక్షణకు ఎలా ఉపయోగపడతాయి? అనే అంశాలను ఈ పుస్తకంలో వివరించారు. అంతేకాదు, బియ్యం, ఉప్పు, పప్పు మొదలుకొని అల్లం, ఆవాలు, జీలకర్ర వంటి మసాలా దినుసుల్లోని ఆరోగ్య లక్షణాలనూ చెప్పారు.
కేవలం ఔషధ గుణాలనే కాదు, వాటిలోని దుర్గుణాలనూ ప్రస్తావించారు. కొన్ని ఆహారపదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు వాటిని ఏఏ పదార్థాలతో కలిపి తినకూడదో కూడా వివరించడం బాగుంది. అభ్యంగన స్నానం, నూనెతో శరీరాన్ని మర్దన చేయడం వల్ల కలిగే లాభాలూ ఉన్నాయి.
ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఆయా పదార్థాల్లో ఉండే ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి వాటినీ సందర్భోచితంగా అక్కడక్కడ ఉదహరించడం బాగుంది. నొప్పులు, త్రిదోష గుణాలు, ఇన్ఫెక్షన్లు వంటి వాటికి కారణాలు, వాటి నివారణ మార్గాలనూ వివరించారు.
పాత కాలం నాటి వంటలు, వంట పాత్రలు, పెళ్లి, ఒడి బియ్యం వంటి సంప్రదాయాల వెనక ఉన్న సంగతులూ ఈ పుసక్తంలో పంచుకున్నారు. మనకు అందుబాటులో ఉండే ఆయుర్వేదంతోపాటు వంటిల్లు ఏవిధంగా వైద్యశాలలా ఉపయోగపడుతుందో ఉదాహరణలతో సహా వివరించడం బాగుంది.
అయితే, ఏ వస్తువు/పదార్థాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏయే వయస్సుల వాళ్లు తీసుకోవచ్చు/తీసుకోకూడదు? వంటివి అన్నింటికీ జోడించి ఉంటే మరింత బాగుండేది. అలాగే కొన్ని రకాల పదార్థాలకు వాటి శాస్త్రీయ నామాలు చెప్పినప్పటికీ సాధారణ పాఠకుడిని దృష్టిలో ఉంచుకొని వాటి బొమ్మలు వేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది.
ఆయుర్వేద ప్రయోజనాలు, ప్రాముఖ్యం తెలుసుకోవాలనుకునేవాళ్లకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని కొన్ని క్లిష్టమైన వైద్య అంశాలను ఆచరించాలని/పాటించాలని అనుకునేవాళ్లు ఆయుర్వేద వైద్యరంగంలోని నిష్ణాతులను సంప్రదించి, వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
- జి. మహేశ్వర్
- లైఫ్& లిటరేచర్ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
- రచన 700 పదాలకు మించరాదు.
