
‘‘ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం” ఈ రెండు విషయాల చుట్టూనే ఇప్పుడు మనిషి జీవితం నడుస్తోంది. ‘ఆరోగ్యకరమైనదే తింటున్నామా? ఏది తింటే మంచిది? ఇంతకంటే మంచివి ఇంకేం తినొచ్చు?’.. ఇట్లాంటి ప్రశ్నలే బుర్ర నిండా తిరుగుతున్నాయి. డాక్టర్లు కూడా మందుల కంటే ఎక్కువగా తిండి విషయంలోనే దృష్టిపెట్టాలని జనాలకు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల తినే అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. వెనకటి వంటలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. అదే టైంలో రోజూ వంటల్లో వాడే నూనెల్లో ఏది మంచిదనే చర్చా తెర మీదకు వచ్చింది.
ఆరోగ్యం కోసం జనాలు ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. కొవిడ్ టైం నుంచి గ్రోసరీ స్టోర్లలో షెల్ఫ్‌ల నిండా హెల్త్ కేర్ ప్రొడక్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇళ్లలో వాడే వంట నూనెల సంగతి ఏంటి?. ఆహారంలో తృణ ధాన్యాల (మిల్లెట్స్) మోతాదు పెరిగినట్లే, ఇపుడు గానుగ నూనెలకు క్రేజ్ వచ్చింది. మునుపటి తరాలు వాడిన ఈ నూనెలతో ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం జనాల్లో రోజురోజుకీ పెరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్స్‌తో పోలిస్తే గానుగ నూనెల ధర చాలా ఎక్కువ. అయినా కూడా ‘డోంట్ కేర్’ అంటూ కొనుక్కుంటున్నారు. అయితే సైంటిఫిక్ మెథడ్‌లో తయారుచేసే రిఫైన్డ్ ఆయిల్స్‌తో ఇబ్బందులేంటి? గుండె జబ్బులు రావని, ఆరోగ్యంగా ఉంటారని, బోలెడు విటమిన్లు దొరుకుతాయని ఇస్తున్న అడ్వర్టైజ్‌మెంట్‌లో వాస్తవం ఎంత? రిఫైన్డ్ ఆయిల్– గానుగ నూనెలు.. ఈ రెండింటిలో ఏది బెటర్? అనే ప్రశ్నకు ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో చూద్దాం.
రిఫైన్డ్ ఎలా మొదలైందంటే..
గానుగ నూనెల వల్ల ఒకప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు. ఎలాంటి జబ్బులు వచ్చేవి కావు. కానీ తర్వాతి కాలంలో గానుగ నూనె వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందనే ప్రచారం మొదలైంది. గానుగ నూనెల్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందని, ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండెను దెబ్బ తీస్తాయని జనాలు అనుకోవడం మొదలుపెట్టారు. అయితే1990లో అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ రీసెర్చర్లు ‘రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు మంచివని’ సర్టిఫై చేశారు. అప్పటి నుంచే గానుగ నూనెలకు బ్యాడ్ టైం మొదలైందని చెప్తుంటారు. ఆ తర్వాతే గుండె జబ్బుల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లు ‘‘ఇది గుండెకు మంచిది’’, ‘‘మా ప్రొడక్టుల్లో విటమిన్లు ఎక్కువ”అనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి రిఫైన్డ్ ఆయిల్ బ్రాండ్స్. ఇప్పుడేమో ‘‘ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్’’ అంటూ టైమ్లీ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. అయితే రిఫైన్డ్ అయిల్స్ తయారయ్యే విధానం చూస్తే అవి మంచివో, కాదో అర్థమైపోతుంది.
కెమికల్స్‌లో ముంచి, మరిగించి..
రిఫైన్డ్ ఆయిల్స్.. అంటే శుద్ధి చేసిన నూనెలు. ఈ పద్ధతిలో నూనె తయారీ కోసం పూర్తిగా గింజలనే వాడతారనే నమ్మకం లేదు. పెట్రోలియం బైప్రొడక్ట్ అయిన పాలిమర్ ఆయిల్ నుంచి కూడా రిఫైన్డ్ నూనెలు తయారు చేస్తారు. పాలిమర్ ఆయిల్ అగ్గువ, లీటర్‌కి 20 రూపాయలకు దొరుకుతుంది. అలాగే రిఫైన్డ్ ఆయిల్ తయారీదారులు నూనె తయారీలో వాడే బేసిక్ మెటీరియల్‌ను క్రూడ్ ఆయిల్ అనే పిలుస్తారు. రిఫైన్ చేయడం వల్ల నూనెల్లో నుంచి ఆరోగ్యాన్ని పాడుచేసే పదార్థాలను తీసేస్తారని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది (80–85 శాతం) రిఫైన్డ్ ఆయిల్సే వాడతారనే విషయాన్ని గుర్తు చేస్తారు. అయితే రిఫైన్డ్ ఆయిల్ తయారీలో ఫిజికల్‌తో పాటు కెమికల్ ప్రాసెసింగ్‌లు తప్పనిసరి.రిఫైన్ ఆయిల్ తయారీలో నాలుగు ప్రధానమైన స్టేజ్‌లు ఉంటాయి. అవి డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, డియోడరైజింగ్. ఈ దశల్లో నూనెలు రకరకాల కెమికల్ ట్రీట్మెంట్కు గురవుతాయి. హై టెంపరేచర్ (200 నుంచి 400 డిగ్రీల సెల్సియస్) వద్ద వేడి చేస్తారు. డీగమ్మింగ్లో ముడి చమురుల్లో ఉండే బంకలాంటి (ఫాస్పటైడ్స్) పదార్థాన్ని వేరు చేస్తారు. ఈ ప్రాసెస్‌లో హెక్సేన్ అనే కెమికల్ ఉపయోగిస్తారు. దీన్ని తర్వాతి స్టేజ్లలో తీసేసే ప్రయత్నం చేసినా కానీ ట్రేసెస్ మిగిలిపోతాయి. రెండో దశ న్యూట్రలైజేషన్ ప్రక్రియ. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్‌ను తొలగిస్తారు. దీన్ని ‘కెమికల్ రిఫైనింగ్’ అని కూడా అంటారు. ఈ మెథడ్‌ని ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్ రిఫైనింగ్ కోసం వాడతారు. ఫాస్పరిక్ యాసిడ్‌తో క్రూడాయిల్ని ట్రీట్ చేశాక కాస్టిక్ (సోడియం హైడ్రాక్సైడ్) సొల్యూషన్‌తో నూట్రలైజ్ చేస్తారు. అప్పుడు నూనెపై నురగలాంటి పదార్థం తేలుతుంది. సెంట్రిఫ్యూజ్ విధానం ద్వారా కొన్ని మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆయిల్‌ని డియోడరైజేషన్ చేస్తారు. ఇక్కడ 240 నుంచి 260 డిగ్రీల సెల్సియెస్ టెంపరేచర్‌లో ఆయిల్‌ని వేడి చేసి అందులోని ఆడర్ (వాసన)ని తొలగిస్తారు. అలా ఈ నాలుగు స్టేజ్ల్లో మరికొన్ని ట్రీట్మెంట్లు చేస్తారు. ఆరేడు రకాల కెమికల్స్‌ని ఉపయోగిస్తారు. మొత్తం మీద ఈ ప్రాసెస్ల ద్వారా తయారైన రిఫైన్డ్ ఆయిల్ బయటకు వచ్చాక దాన్ని ప్లాస్టిక్ కవర్స్, బాటిళ్లలో ప్యాక్ చేస్తారు. ఇలా తయారైన రిఫైన్డ్ ఆయిల్‌కు నూనెకు రంగు, రుచి, వాసన వుండవు. అన్ని నూనెలు ఒకే రకంగా ఉంటాయి. గడ్డ కట్టవు. ఏళ్ల తరబడి పాడు కావు. కొన్ని కంపెనీలు వాసన కోసం ఎసెన్స్ కలుపుతాయి. ముడి నూనెల నుంచి ఫ్రీఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, ఆక్సిడైజ్డ్ ప్రొడక్టులు, మెటల్ అయాన్స్, కలర్ పిగ్మెంట్స్, ఇతర ఇంప్యూరిటీలను తొలగించేందుకు రిఫైనింగ్ పద్ధతి వాడుతున్నామని ఆయిల్ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. రిఫైనింగ్ వల్ల విటమిన్–ఇ పోకుండా ఉంటుందని, గింజ నుంచి పూర్తిస్థాయిలో నూనెను పిండొచ్చని అంటాయి. రిఫైనింగ్ ప్రాసెస్ అంతా ఎఫ్ఎస్ఎస్ఎఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాల ప్రకారమే జరుగుతుందని ప్రచారం చేసుకుంటాయి.
ట్రెడిషనల్ గానుగ నూనెలు
గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్–ఇ, ఒమెగా–3, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే గానుగ నూనెల తయారీ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆన్లైన్లో మిషన్లు తెప్పించుకుని.. ఇళ్లలోనే నూనె తయారుచేసుకుంటున్నారు కొందరు.
సంప్రదాయ పద్ధతుల్లో గానుగ నూనెలు తీసే పద్ధతులు ఉన్నాయి. దున్నపోతులు, ఎడ్లు, లేగదూడలు, గాడిదలను కాడికి కట్టి గానుగలో గింజలు వేసి గుండ్రంగా తిప్పుతారు. అప్పుడు గింజలు పిప్పి పిప్పి అయ్యి.. ఆ గానుగలో నుంచి నూనె బయటకు వస్తుంది. గానుగ ఆడింటచేప్పుడు ఆర్పీఎం (రోటేషన్ పర్ మినిట్) తక్కువగా ఉంటుంది. నిముషానికి రెండు, మూడు చుట్లు తిరిగినప్పుడు.. టెంపరేచర్ ఎక్కువగా రిలీజ్ కాదు. ఫలితంగా నూనెలో పోషకాలు పోవు. అయితే ఇప్పుడు కరెంట్‌తో నడిచే గానుగ మిషిన్లు వచ్చాయి. దీని ఆర్పీఎం కొంచెం ఎక్కువగా ఉంటోంది. గానుగ నూనెలోని దాదాపు అన్ని పోషక విలువలు ఉంటాయి. మిషన్ గానుగల్లో ఇప్పుడు పల్లీ, నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ, ఆవాలు, అవిసె, బాదం, కొబ్బరి, ఆముదం గింజల నుంచి రకరకాల నూనెలు తీస్తున్నారు. గింజలు తీసుకుపోతే నూనె పట్టించే సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మే సెంటర్లలో ఆర్గానిక్ గింజలతో కళ్ల ముందే నూనె తీసి ఇస్తున్నారు.
ఒకే రకం ఆయిల్ వాడొద్దు
పంజాబ్, హర్యానాల్లో ఆవ గింజల నూనె, గుజరాత్లో పత్తి గింజల నూనె, దక్షిణాది రాష్ట్రాల్లో పల్లి, నువ్వుల నూనెల్ని, కేరళలో కొబ్బరి నూనెను ఎక్కువ వాడతారు. ఒకప్పుడు ఒకేరకమైన నూనెల్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. గ్లోబలైజేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, జనాల్లో హెల్త్ కాన్షియస్ పెరగడంతో.. జనాలు రకరకాల ఆయిల్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా పల్లీ, నువ్వుల నూనెల్ని ఎక్కువగా వాడే మన ప్రాంతాల్లో.. కొబ్బరి నూనె వాడకం కూడా పెరిగింది. అలాగే ఆరోగ్యానికి మంచిదని కొందరు కుసుమ, ఆవ, పొద్దుతిరుగుడు(సన్‌ఫ్లవర్), రైస్ బ్రాన్.. అంటూ రకరకాల నూనెలు వాడుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు అన్నిరకాల నూనెలు దొరుకుతున్నాయి. వెజిటబుల్ ఆయిల్స్‌తో పాటు యానిమల్ ఫ్యాట్‌ని కూడా కొందరు వంటలకు ఉపయోగిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్స్ లేని రోజుల్లో.. యానిమల్ ఫ్యాట్‌ను వాడే వాళ్లు. ఆరోగ్యంగా ఉండేవాళ్లు. అందుకే నెయ్యిని కూడా వంటల్లో వినియోగించమని చెప్తున్నారు. ముఖ్యంగా ఆవు నెయ్యి ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. అయితే గానుగ నూనె అయినా, రిఫైన్డ్ ఆయిల్ అయినా ఎప్పుడూ ఒక్కటే వాడకుండా మారుస్తూ ఉండడం మంచిదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఒకసారి డీప్ ఫ్రైకి వాడిన నూనె.. రెండో సారి కూరల తయారీలో మాత్రం ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ ఆయిల్‌ని మూడోసారి వాడడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు.
నూనెలందు పేర్లు వేరయా!
గానుగను ‘చెక్క’తో తయారు చేస్తారు. మెషిన్ గానుగలోనూ సహజత్వం కోసం ‘చెక్క’ను వినియోగిస్తారు. అందుకే ఈ పద్ధతిలో తీసిన ఆయిల్‌ను ‘చెక్క నూనె’(కర్ర నూనె) అంటారు. గానుగ పద్ధతిలో అతి తక్కువ టెంపరేచర్‌లో నూనె బయటకు తీస్తారు. తక్కువ టెంపరేచర్‌లో ఒత్తిడికి గురి చేసి నూనెను ఉత్పత్తి చేయడాన్ని వల్ల వీటికి ‘కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్’ అనే పేరొచ్చింది. వర్జిన్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ కూడా సంప్రదాయ పద్ధతిలో తీసిన నూనెలే. అయితే ఈ పేర్లన్నీ కేవలం కస్టమర్లను ఆకర్షించేందుకే!. రిఫైన్ చేయకుండా సహజ పద్ధతిలో గింజను కోల్డ్ ప్రెస్ చేయడం వల్ల ఉత్పత్తి అయిన ఆయిల్‌ని ‘వర్జిన్ ఆయిల్’ అని అంటారు. ఇందులో ఎసిడిటీ పర్సంటేజ్ రెండు శాతం కన్నా తక్కువగా ఉంటుంది. దీనికన్నా ఎక్స్ట్రా వర్జిన్ మంచిది. ఈ ఆయిల్లో ఎసిడిటీ 0.8 శాతం కన్నా ఎక్కువ ఉండదు. నిజానికి వర్జిన్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అనే పదాలు ‘ఆలివ్ ఆయిల్’ మార్కెటింగ్ క్యాంపెయిన్ నుంచి పుట్టాయి. ఈ పదాలు ఇతర నూనెలకు సరిపడవు. కానీ ఆలివ్ ఆయిల్ సేల్స్ పెరగడానికి ఈ పేర్లు బాగా పనికొచ్చాయి. అందుకే ఇతర నూనెల ప్యాక్‌లపై కూడా ఇలాంటి పేర్లు వాడుతున్నారు. ఇక రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కెమికల్ ట్రీట్మెంట్తో తయారవుతాయి. ఇందులో కూడా రకరకాల పద్ధతులున్నాయి. అందుకే రిఫైన్డ్లో కూడా ‘ఎక్స్ట్రా రిఫైన్డ్’, ‘డబుల్ రిఫైన్డ్’, ‘ట్రిపుల్ రిఫైన్డ్’ ఆయిల్స్ అంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మూఫా.. ఫూఫా
యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్.. ఈ రెండింటిలో ఏది మంచిది? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. యానిమల్ ఫ్యాట్లో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ (మూఫా) ఉంటుంది. వెజిటబుల్ ఆయిల్స్‌లో పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (పూఫా) ఉంటాయి. శరీరానికి ఈ రెండూ అవసరమే అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. పాత రోజుల్లో ఆవు, బర్రె నెయ్యితో పాటు వెన్నను కూడా వంటల్లో వాడేవాళ్లు. కాబట్టి యానిమల్ ఫ్యాట్ మంచిదని చెప్తుంటారు. ఇక వెజిటబుల్ ఆయిల్స్‌తో గుండె జబ్బులు రావని అంటారు. అయితే తిండి పరిమితంగా ఉన్నప్పుడు.. ఏ ఫ్యాట్ అయినా మంచిదే అనేది వాళ్ల మాట.
ఎంత తీసుకోవాలంటే..
మనిషి తాను చేసే పనిని బట్టి ఒకరోజులో ఆయిల్‌ను తీసుకోవాలి. హార్డ్ వర్క్ చేసేవాళ్లు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. అంటే దాదాపు 30 గ్రాములన్నమాట. ఇక సెడెంటరీ లైఫ్ స్టైల్ (కూర్చుని పనిచేసేవాళ్లు)లో ఉండేవాళ్లు నాలుగు నుంచి ఐదు చెంచాల నూనె తీసుకోవాలి. ఒబేసిటి, గుండె జబ్బులు ఉన్నవాళ్లు మూడు చెంచాల నూనె వరకు తీసుకోవచ్చు. అలాగే నూనెతో పాటు మనిషికి హెల్దీ ఫ్యాట్‌ను అందించే నట్స్, సీడ్స్ కూడా అవసరం. వీటిని ఇండైరెక్ట్ ఆయిల్స్‌గా చెప్తారు. ఒబేసిటితో బాధపడేవాళ్లు 15 నుంచి 20 గ్రాముల నట్స్ తీసుకోవచ్చు. నార్మల్ వెయిట్ ఉన్నవాళ్లు 25 గ్రాములు, ప్రెగ్నెన్సీ టైంలో 30 గ్రాములు నట్స్, సీడ్స్ తీసుకోవచ్చు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు 22 నుంచి 25 గ్రాములు తీసుకోవచ్చు. హార్డ్ వర్క్ చేసేవాళ్లు ప్రతిరోజు 30 గ్రాముల వరకు నట్స్ తింటే మంచిది. యావరేజ్‌గా మనిషికి నెలకి అరలీటర్ నూనె సరిపోతుంది. నట్స్ , సీడ్స్ ఒక గుప్పెడు ప్రతిరోజు తీసుకుంటే మంచిది.
ఆరోగ్యం కోసం..
కోల్డ్ ప్రెస్డ్ (గానుగ) నూనెలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ నూనెల తయారీ ఎంతో శ్రమతో కూడుకొని ఉంటుంది. అందుకే రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ నూనెలని యూజ్ చేయడం వల్ల హెల్దీగా ఉండొచ్చు. ఆరోగ్య సమస్యల్ని బట్టి ఆయిల్స్ వాడడం ఈ రోజుల్లో అన్ని రకాలుగా మంచిది. అయితే గానుగ పట్టిన నూనెలే గుండెకి మంచిది. జనాలు తక్కువ రేటుకు వస్తుంది కదా అని రిఫైన్డ్ ఆయిల్స్ కొంటున్నారు. అలాగే నూనెలను అప్పుడప్పుడు మారుస్తూ ఉండడం మంచిది. కొన్ని రోజులు ఒక నూనె, ఇంకొన్ని రోజులు ఇంకో రకమైన నూనె యూజ్ చేయాలి.- డా. ప్రణీత్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
క్యాన్సర్ కారకాలు
ఏ రకంగా చూసినా రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా గానుగ నూనెలే మంచివి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వర్జిన్ ఆయిల్స్ అనీ, టేబుల్ టాప్ ఆయిల్స్ అని రకరకాల ఆయిల్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అందుబాటులో ఉంటున్నవి, ఆరోగ్యానికి మంచివని చెబితే దేన్నిపడితే దాన్ని జనాలు వాడుతున్నారు. రిఫైన్డ్ ఆయిల్స్ కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా తయారవుతాయి. అందులో హెక్సేన్ లాంటి సాల్వెంట్ల ట్రేసెస్ ఉంటాయి. అవి క్యాన్సర్ కారకాలు. ఈ నూనెలు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్‌లు కూడా కలుపుతారు.–డాక్టర్ కె.నర్సయ్య, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐకార్–సీఫెట్,లూధియానా
మంచి చేస్తది
గానుగలో ఆడించిన నూనెలు అన్నింటికన్నా మంచివి. రిఫైన్డ్ ఆయిల్స్‌తో పోలిస్తే చాలా బెటర్. సహజ పద్ధతుల్లో తీసే గానుగ నూనెల్లో విటమిన్ ఈ.. సిలతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీరాడికల్స్‌ని నాశనం చేస్తాయి. తద్వారా బాడీ పెయిన్స్ రావు. అలాగే ఇమ్యూనిటీని పెంచుతాయి. బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపడడానికి. రక్తం సరఫరా సజావుగా జరగడానికి తోడ్పడతాయి. విటమిన్ ఎ వల్ల చర్మం మెరుస్తుంది. అదే రిఫైన్డ్ ఆయిల్‌ని డిస్టిలేషన్, ప్యూరిఫికేషన్, ఫిల్టరేషన్ పద్ధతుల్లో తయారుచేస్తారు. ఈ మూడు స్టెప్స్ కోసం రకరకాల కెమికల్స్ ని వాడతారు. కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన ఆ ఆయిల్ వాడడం సమస్యే కదా!. పైగా వీటి వల్ల లంగ్స్ దెబ్బతింటాయి. డైజెస్టివ్ సిస్టమ్ చెడిపోవడంతో పాటు గుండె సమస్యలు వస్తాయి. అందుకే ప్రాసెసింగ్ కాని ఆయిల్స్ శరీరానికి మంచివి. కోల్డ్ ప్రెస్ (గానుగ) ద్వారా తీసిన ఆయిల్ తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.–డా. శ్రీలత, న్యూట్రిషనిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్
గానుగ మీదే బతుకుతున్నం
గానుగ నూనె, మిల్లెట్స్ అమ్మకాలే మాకు ఇప్పుడు ఉపాధి. లక్షన్నర పెట్టుబడితో గానుగ నూనెల తయారీ మొదలుపెట్టాం. మొదట్లో జనం పెద్దగా రాలేదు. గానుగ నూనెల మీద అవగాహన కల్పిస్తూ తిరిగాం. ఇప్పుడు 50 మంది కస్టమర్లు ఉన్నారు. నెలకు రెండు వందల లీటర్ల వరకు గానుగ నూనె అమ్ముతున్నాం. అందరికి మేమే డోర్ డెలివరీ చేస్తాం. మేం పల్లీ నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ ఫ్లవర్ నూనె, ఆవ నూనె, ఆముదం నూనె, అవిసె నూనె, నల్ల నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, బాదం నూనె, కురిడి కొబ్బరి నూనెలు అమ్ముతున్నాం. కుటుంబం గడవడానికి తగిన ఆదాయం వస్తోంది.–బీ ధనలక్ష్మి, బీబీనగర్
రేట్లు ఎందుకు పెరిగినయంటే..
ప్రస్తుతం ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం రకరకాల స్ట్రాటజీలు ప్రయోగిస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన ఫుడ్ ప్రొడక్ట్‌ను.. ‘ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంద’నే ప్రచారంతో ప్రపంచమంతా రుద్దుతున్నారు. అమెరికాలో బాదం పంట ఎక్కువగా పండుతుంది. దీన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి ఒక సంవత్సరానికి మూడు నుంచి నాలుగు వందల కోట్లు(మన కరెన్సీలో) ఖర్చు పెడుతున్నారు. వంట నూనెల విషయంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ప్రపంచంలో పామాయిల్ దిగుమతుల్లో మన వాటానే ఎక్కువ. మలేసియా నుంచి ఏటా 70 వేల కోట్ల రూపాయల విలువ చేసే పామాయిల్ మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అలాగే అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుంచి సోయా పంటను లక్షల టన్నుల్లో దిగుమతి చేసుకుంటున్నాం. సన్‌ఫ్లవర్ కూడా భారీ ఎత్తున దిగుమతి అవుతోంది. ఈ దిగుమతులే రిఫైన్డ్ ఆయిల్ ఇండస్ట్రీలకు ప్రధాన ఆధారం. ఇప్పుడు వంట నూనె రేట్లు పెరగడానికి గల మెయిన్ రీజన్.. ఆ దేశాల్లో ఆ పంట ఉత్పత్తులు తగ్గిపోవడమే!. మన దగ్గర పల్లీ, నువ్వులు, ఆవాలు, అవిసెలు, పత్తి గింజల నుంచి ఏడాదికి 8 మిలియన్ టన్నుల వంట నూనె ఉత్పత్తి చేస్తున్నారు. సంవత్సరానికి సగటున మన దగ్గర ఒక వ్యక్తికి 11 లీటర్ల నూనె అవసరం. కానీ, 19.3 లీటర్లు ఉపయోగిస్తున్నారు. కరోనా టైం నుంచి ఇది ఇంకా పెరిగింది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకే బయటి దేశాల నుంచి ఎక్కువ రేటుతో కుకింగ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు ఐఐసీటీ మాజీ సైంటిస్ట్ ఒకరు చెప్పారు.
రేట్లలో తేడా ఎందుకంటే..
లీటర్ పల్లీ నూనె ప్యాకెట్ రేటు రూ.130 నుంచి రూ.150 దాకా ఉండొచ్చు. అదే గానుగ పల్లీ నూనె ధర లీటర్‌కి రూ. 340 నుంచి రూ. 360 వరకు ఉంటుంది. గానుగ పద్ధతిలో కేజీ పల్లీల నుంచి 350–400 గ్రాముల నూనె తీస్తారు. అంటే మూడు కేజీల పల్లీలకు ఒక కేజీ ఆయిల్ వస్తుంది. కిలో పల్లీ కాయల ధర 100 నుంచి 120 రూపాయల దాకా ఉంది. అందుకే గానుగ నూనె రేటు ఎక్కువ. గానుగ నూనెలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్లకు ఈ రేట్ల తేడానే పనికొస్తోంది. అంతేకాదు గానుగ పద్ధతిలో గింజల నుంచి 30 నుంచి 40 శాతమే ఆయిల్ బయటకు వస్తుందనీ, మిగతా నూనె వేస్ట్ మెటీరియల్‌గా బయటకు వచ్చే పల్ప్‌లో ఉండిపోతుందని అంటారు. ఈ పల్ప్‌ని పశువులకు దాణాగా వాడతారు. తాజా పిప్పిని మనుషులు కూడా తింటారు. ఈ లెక్కన గానుగ పద్ధతిలో గింజల నుంచి పూర్తి నూనె బయటకు రాదని, పైగా రేటు కూడా ఎక్కువ ఉంటుందనే ప్రచారం ఉంది. ఇక రిఫైన్డ్ ఆయిల్స్ తయారీలో 95 శాతం పైగా నూనె బయటకు వస్తుందనీ, పైగా దాని రేటు కూడా తక్కువగా ఉంటుందని కంపెనీలు ప్రచారం చేస్తుంటాయి. అయితే రిఫైన్డ్ ఆయిల్స్‌లో గింజలతో పాటు( ఒక్కోసారి గింజల కంటే ఎక్కువగా) తక్కువ ధరకే వచ్చే గింజల్ని కూడా కలుపుతారు. అదనంగా పాలిమర్ ఆయిల్‌ను మిక్స్ చేస్తారు. ఇదంతా రిఫైన్డ్ ఆయిల్ కంపెనీలకు వర్కవుట్ అవుతోందనేది ఎక్స్‌పర్ట్‌లు చెప్పే మాట.
రిఫైన్డ్తో నష్టం లేదు..
గానుగ అయినా, రిఫైన్డ్ అయినా రెండు నూనెలూ మంచివే. రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి కావనే అభిప్రాయం కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా 80–85 శాతం మంది రిఫైన్డ్ నూనెలే వాడతారు. రిఫైన్డ్ నూనెలు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (FSSAI) గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేస్తారు. ఈ సంస్థ లైసెన్స్ పొందిన కంపెనీలు తయారుచేసే నూనెలన్నీ మంచివే. నూనెల్ని కొనేటపుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఈ సంస్థ గైడ్‌లైన్స్ ప్రకారం నూనెలు ఉన్నాయా లేదా అనే చెకింగ్స్ జరుగుతాయి. ఇంటర్నేషనల్ లెవల్లో అయితే కోడెక్స్ నియమాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆయిల్స్‌తో ప్రమాదం ఉండదు. ప్రమాదకారకాలను తొలగించేందుకే నూనెల్ని ప్రాసెస్ చేస్తారు. పైగా వీటిల్లో టాక్సిన్స్ వుండవు. అనుమతి పొందిన కెమికల్స్‌తోనే రిఫైన్ చేస్తారు. అయితే కొన్ని రకాల ఆయిల్స్‌ను వాడినపుడు వాటిని వేరే వాటితో మిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకు పామ్ ఆయిల్ వాడాలనుకునే వాళ్లు.. అందులో సన్‌ఫ్లవర్, సోయాబీన్, రైస్ బ్రాన్, నువ్వుల నూనెను 50 శాతం రేషియాలో కలపొచ్చు. సగం పామాయిల్‌కి ఇతర నూనెల్ని సగం మిక్స్ చేసి వాడుకోవడం మంచిది. అలాగే గానుగ నూనెలతోనే రిస్క్ ఛాన్స్ ఉంది. పుచ్చిపోయిన గింజల్ని వాడి నూనె తయారుచేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ నూనెను వాడినా, ఒక వ్యక్తికి రోజుకు 30 గ్రాముల నూనె వాడితే సరిపోతుంది. –ఆర్బీఎన్ ప్రసాద్, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్, ఐఐసీటీ ఛైర్మన్, సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ
కరోనాతో మారింది
గత పదేళ్ల నుంచి మా రిసార్ట్స్ లో గానుగ నూనె తీస్తున్నాం. సహజ పద్ధతుల్లో అంటే ఎద్దులతో నడిచే కట్టె గానుగ ఏర్పాటుచేసి పల్లీ, నువ్వుల నూనె, వెర్రినువ్వుల నూనె, కొబ్బరినూనె, కుసుమ నూనెలు తయారుచేస్తున్నాం. మొదట్లో మా దగ్గరికి గానుగ నూనెల కోసం నెలకు 30 మంది కస్టమర్లు వచ్చేవాళ్లు. ఇప్పుడు వంద మంది వస్తున్నారు. ఇదంతా కరోనా వల్లే. రిఫైన్డ్ ఆయిల్స్ ని తయారుచేసేటప్పుడు మెషిన్లలో ఉండే ఎక్కువ వేడివల్ల రిఫైన్డ్ ఆయిల్ లో ఎలాంటి పోషకాలు ఉండవు. వాటిని వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ గానుగ నూనె శరీరానికి చాలా మంచిది. ఒక ఇంట్లో రోజూ వాడే రిఫైన్డ్ నూనెతో పోలిస్తే 20 శాతం కట్టె గానుగ నూనె సరిపోతుంది. నెలకి ఐదు కిలోల రిఫైండ్ ఆయిల్ వాడితే, కట్టె గానుగ నూనె మాత్రం రెండు కేజీలు వాడితే సరిపోతుంది. –డా. జీబీకే రావు, చైర్మన్, ప్రగతి గ్రూప్స్
డైటెటిక్స్ ఏమంటోందంటే..
తీసుకునే ఫుడ్.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని డైటెటిక్స్ ఎక్స్‌పర్ట్స్ స్టడీ చేస్తారు. వీళ్లు కూడా గానుగ నూనెలే మంచివని చెబుతున్నారు. డైటెటిక్స్ స్డడీలో భాగంగా.. జన్యువులపై చూపే తిండి ప్రభావాన్ని పరిశీలిస్తారు. పాత తరం మనుషులు ఏం తిన్నారు, వాళ్ల తిండి ప్రభావం జీన్స్‌లపై ఎలా ఉంది? అవే జీన్స్ కలిగిన వారసులపై ఎలా ఉంటుంది? అనే విషయాలపై వీళ్లు ఒక అంచనాకి వస్తారు. పాత తరం వాళ్లంతా గానుగ నూనెలు తిని బతికిన వాళ్లే. వాళ్లకు జబ్బులు కూడా తక్కువ. మారిన లైఫ్ స్టైల్స్, ఫుడ్ హాబిట్స్, ఫుడ్ కల్చర్ వల్ల ముందు తరం నుంచి వచ్చిన జీన్స్‌పై ప్రభావం పడుతుందనీ,అప్పుడు శరీరంలో ప్రతికూల ప్రభావం పడుతుందని డైటెటిక్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. కరువు బాధిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి రోజుకు రెండు పూటలు మితాహారం తీసుకున్నా ‘ఒబీస్’ అవుతారని డైటెటిక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆకలికి అలవాటు పడిన ఆ జీన్స్ వల్లకానీ శరీరానికి రెగ్యులర్‌గా పోషకాలు అందిన కానీ అది ఊబకాయానికే దారి తీస్తుందని అంటారు. అందుకే ఇలాంటి వాళ్లు పాత తరం వాళ్లు తినే ఏ ఫుడ్ అయినా హాయిగా తీసుకోవచ్చని చెప్తారు. ::: పి.శశికాంత్