పిగ్ లెట్ యోగా గురించి విన్నారా? ఈ యోగాతో చాలా ప్రయోజనాలున్నాయట..ఫుల్ డిటెయిల్స్

పిగ్ లెట్ యోగా గురించి విన్నారా? ఈ యోగాతో చాలా ప్రయోజనాలున్నాయట..ఫుల్ డిటెయిల్స్

యోగా మనస్సు, శరీరాన్ని రిలాక్స్ చేయడానికి అద్భుతమైన మార్గం.రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా సాధన చేయాలి. కండరాలకు ఎక్సర్‌సైజు అందిం చడానికి కూడా ఇది మంచి మార్గం. అయితే ఈ అనుభవాన్ని మరింత సంతోషంగా మార్చుకునే అవకాశం ఉందా చాలా మంది అనుకుంటారు. కచ్చితంగా ఉందం టున్నారు యోగా నిపుణులు. 

ఇటీవల మసాచుసెట్స్‌లోని యోగా క్లాస్‌లోకి మూడు పంది పిల్లలు (Piglets) వచ్చి అందరికీ ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించాయి. మహిళలు యోగా చేస్తున్నప్పుడు పంది పిల్లలు వారి చుట్టూ తిరుగుతూ ఆడుకున్నాయి. వాటి చేష్టలు చూసి యోగా చేస్తున్న వారందరూ నవ్వుతూ ఆనందించారు. ఈ సంఘటన వల్ల ఆ యోగా క్లాస్ మరింత ప్రత్యేకంగా  సరదాగా మారింది. దీంతో ఒక మహిళ ఈ సంఘటన ద్వారా ప్రేరణ పొంది యోగాలో ఒక కొత్త ట్రెండ్‌ని ప్రారంభించింది.

కొత్త తరహా యోగా

మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని యాష్లే బొస్కెట్ అనే మహిళ పంది పిల్లలతో యోగా ప్రాక్టీస్ సెషన్ నిర్వహించేందుకు సిద్దమయింది. ఈమె బియాండ్ యోగా & వెల్‌నెస్ సెంటర్‌ పేరిట ఓ యోగా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్‌లో పిగ్లెట్ యోగా (Piglet yoga) అనే కొత్త టైప్ యోగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త రకం యోగా గురించి తెలుసుకున్న చాలా మంది ఆ సెంటర్‌లో చేరారు. డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందంటే, ఆమె ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌ కొన్ని గంటల్లోనే అమ్ముడైపోయాయి.

పంది పిల్లల ఇంటరప్షన్స్ గురించి సూచనలు

యాష్లే ఈ పిగ్లెట్ యోగా గురించి పార్టిసిపెంట్లను ముందుగానే హెచ్చరిస్తుంది. పంది పిల్లల వల్ల కలిగే అంతరాయాలను పట్టించుకోకుండా యోగా భంగిమలను కొనసాగించమని మెంబర్స్‌కు తెలియజేస్తుంది. ప్రశాంతంగా యోగా చేసుకోవాలని భావించే వారికి ఇది సూట్ కాదని చెబుతోంది. పంది పిల్లలు యోగా చేసే వారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి వారితో ఆడుకుంటాయని చెప్పింది. కొన్నిసార్లు అవి చాలా అల్లరి చేస్తాయని కూడా తెలియజేసింది.

పిల్లలకు పిగ్లెట్ యోగా..

ఇటీవల ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను పిగ్లెట్ యోగా సెషన్‌కు తీసుకెళ్లింది. ఆమె కుమార్తెలు ముద్దుగా ఉన్న పిల్లలతో వారి సెషన్‌ను ఆనందించారు. ‘పంది పిల్లలు చాలా సంతోషంగా పరిగెత్తడం చూస్తుంటే చాలా బాగుంది. కానీ సెషన్ చాలా త్వరగా ముగిసిపోవడం వల్ల బాధగా అనిపించింది’అని ఆ మహిళ చెప్పుకొచ్చింది. 

మసాచుసెట్స్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ వారు కూడా జంతువులతో యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది పార్టిసిపెంట్లలో దత్తత తీసుకునే భావాన్ని కూడా పెంపొందిస్తుందని ఆమె తెలిపింది. పిగ్లెట్ యోగా క్లాసులు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పాపులర్‌ అవుతున్నాయి. ఈ తరగతులు సాధారణ యోగా అందించే అదే ప్రయోజనాలను అందించడమే కాకుండా సెషన్‌కు చాలా ఆనందాన్ని కూడా జోడిస్తాయని అనేక మంది నమ్ముతున్నారు.