- రెండుచోట్లా వెల్లువలా తరలివచ్చిన రైతులు
- ఖమ్మంలో 70 వేలు, వరంగల్‌లో 50 వేల బస్తాల విక్రయం
- పెద్దమొత్తంలో రావడంతో ధరలు తగ్గించిన వ్యాపారులు
- గరిష్టంగా క్వింటాల్‌కు రూ.13 వేలు పలికిన రేటు
ఖమ్మం/వరంగల్, వెలుగు: ఖమ్మం, వరంగల్ ఏనుమాముల మార్కెట్లకు మిర్చి పోటెత్తింది. 20 రోజుల తర్వాత ఖమ్మం, నెల తర్వాత ఏనుమామూల మార్కెట్లు సోమవారం ఓపెన్ కావడంతో రైతులు భారీగా వచ్చారు. ఇన్నాళ్లూ పంటలు అమ్ముకోలేక గోడౌన్లలో దాచుకున్న వాళ్లు, ఇండ్లలో స్టాక్ పెట్టుకున్నవాళ్లు ఒక్కసారిగా మార్కెట్లను ముంచెత్తారు. ఖమ్మంలో మార్కెట్ కు సుమారు 70 వేల బస్తాలు వచ్చాయి. దీంతో మార్కెట్ యార్డు ఎటుచూసినా మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాలతోపాటు ఏపీ నుంచి కూడా రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో ఖమ్మం పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. లాక్‌డౌన్ కారణంగా మార్కెట్కు వచ్చిన రైతులకు బయట ఫుడ్ దొరక్కపోవడంతో ఖమ్మం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. కానీ పెద్దసంఖ్యలో రైతులు రావడం వల్ల ఫిజికల్ డిస్టెన్స్ కనిపించలేదు.
కళకళలాడిన ఏనుమాముల
వరంగల్లోని ఏనుమాముల మార్కెట్ ఎర్రబంగారంతో కళకళలాడింది. ఏప్రిల్ 24 నుంచి బంద్ అయిన మార్కెట్ తిరిగి ఓపెన్ కావడంతో రైతులు పెద్ద ఎత్తున మిర్చి తీసుకొచ్చారు. దాదాపు నెల రోజుల పాటు కొనుగోళ్లు సాగకపోవడం.. మిర్చిని ఇంటి వద్ద స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ కావడంతో భారీగా మిర్చి బస్తాలు తీసుకొచ్చారు. సోమవారం దాదాపు 50 వేల బస్తాలు మార్కెట్ కు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. వండర్ హాట్ రకానికి గరిష్టంగా 14,500, కనిష్టంగా రూ.11 వేలు పలికింది. దీపిక గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.11 వేలు, తేజా రకం గరిష్టంగా రూ.6,500, కనిష్టంగా రూ.5,500, యూఎస్ 341 రకం గరిష్టంగా రూ.5 వేలు, కనిష్టంగా రూ.3 వేల రేటు పలికింది.
