
- గోల్డ్ టార్గెట్‌గా సింధు, సాత్విక్-చిరాగ్
- బరిలో ఏడుగురు షట్లర్లు
వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడల్ తెచ్చిపెట్టిన ఆట బ్యాడ్మింటన్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్‌తో మెరిస్తే.. రియోలో సిల్వర్, టోక్యోలో బ్రాంజ్ మెడల్‌తో పీవీ సింధు డబుల్ ధమాకా మోగించింది. వరుసగా మూడోసారి విశ్వ క్రీడల్లో బరిలో నిలిచిన మన బ్యాడ్మింటన్ ‘సింధూ’రం ఈసారి బంగారు పతకంపై గురి పెట్టగా.. మరో ఆరుగురు రాకెట్ స్టార్లు పతక వేటలో నిలిచారు. మరి, పతక పరంపర పారిస్‌లోనూ కొనసాగుతుందా? మన షట్లర్లు ఈసారి ఒకటి మించి పతకాలు తెస్తారా?
వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: గత రెండు దశాబ్దాల్లో ఇండియన్ ఒలింపిక్ స్పోర్ట్స్ హిస్టరీలో బ్యాడ్మింటన్‌కు లభించిన పాపులారిటీ మరే ఆటకు దక్కలేదు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ నుంచి కుర్రాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, లక్ష్యసేన్ వరకూ ఎంతో మంది తమ ఆటతో స్టార్లుగా మారిపోయారు. బీడబ్ల్యూఎఫ్ సిరీస్‌లు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, థామస్, ఉబెర్ కప్ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టారు.
ర్యాంకుల్లోనూ రికార్డులు సృష్టిస్తూ ఈ ఆటలో మేటి అయిన చైనాకు ఎన్నోసార్లు చెక్ పెట్టారు. ఒకప్పుడు ప్లేయర్లుగా సత్తా చాటిన పుల్లెల గోపీచంద్, ప్రకాశ్ పదుకొనె, విమల్ కుమార్ కోచ్‌లుగా ఈ చాంపియన్లను తీర్చిదిద్దారు. ఒలింపిక్స్‌లోనూ పుష్కరకాలంగా మన రాకెట్లకు తిరుగులేకుండా పోయింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ తెచ్చిన బ్రాంజ్ మెడల్‌తో దేశంలో బ్యాడ్మింటన్ విప్లవం మొదలగా.. రియోలో సిల్వర్ మెడల్‌తో ఈ ఆటను శిఖరానికి తీసుకెళ్లిన పీవీ సింధు.. టోక్యోలో బ్రాంజ్ మెడల్‌తో మరో రికార్డు సృష్టించింది. గత మూడు ఎడిషన్లలో ఒక్కో మెడల్ తెచ్చిన షట్లర్లు పారిస్ ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలే టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నారు.
సింధు.. పసిడి వేటలో
రియోలో సిల్వర్, టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ అందుకున్న సింధు మిగిలిన గోల్డ్ మెడల్‌ను పారిస్‌లో నెగ్గాలని చూస్తోంది. ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఇండియా తొలి మహిళగా చరిత్రకెక్కే అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దని ఆశిస్తోంది. కొన్నాళ్లుగా పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ఆమెకు మైనస్. గతేడాది మోకాలి గాయానికి గురైన తను ఈ ఫిబ్రవరిలో రీఎంట్రీ ఇచ్చి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా గోల్డ్ మెడల్ నెగ్గడంలో భాగమైంది.
కానీ, ఈ సీజన్‌లో ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. అయితే, పెద్ద ఈవెంట్లలో బరిలోకి దిగగానే ఫామ్ అందుకోవడం సింధు స్పెషాలిటీ. బలమైన ప్రత్యర్థులకు అంతే బలంగా బదులిస్తుంటుంది. ప్రస్తుతం 13వ ర్యాంక్‌లో ఉన్న సింధుకు పారిస్‌లో సులువైన డ్రానే ఎదురైంది. అయితే, ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ హి బింగ్జియావో, క్వార్టర్ ఫైనల్లో ఒలిపింక్ చాంపియన్ చెన్ యుఫీ ఎదురయ్యే అవకాశం ఉంది. వీళ్ల అడ్డును దాటితే సింధు మూడో మెడల్‌తో తిరిగి రావొచ్చు.
మెన్స్ సింగిల్స్‌లో సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్, యంగ్‌స్టర్ లక్ష్యసేన్ తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. తమదైన రోజున ఎంత పెద్ద ప్రత్యర్థినైనా ఓడించే సత్తా ఉండటం వీళ్ల ప్లస్ పాయింట్. కానీ, ఈ ఇద్దరిలోనూ నిలకడ లేదు. సులువైన గ్రూప్–కెలో ఉన్న ప్రణయ్, కఠినమైన గ్రూప్–ఎల్‌లో నిలిచిన లక్ష్యసేన్ గ్రూప్ దశ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖి తలపడనున్నారు.
డబుల్లెట్స్‌పైనే కండ్లు
ఈ ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ తెస్తాడని ఆశిస్తున్న వారిలో తెలుగు షట్లర్ 23 ఏండ్ల సాత్విక్ సాయిరాజ్ అతని డబుల్స్ పార్ట్‌నర్ 26 ఏండ్ల చిరాగ్ షెట్టి ముందు వరుసలో ఉన్నారు. మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న ఇండియన్స్ రికార్డు సృష్టించిన ఈ ఇద్దరు ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో గోల్డ్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ 1000 సిరీస్ గెలిచిన షట్లర్ల గానూ నిలిచారు.
కోర్టు లోపల, బయట మంచి స్నేహం, సమన్వయంతో ఉండే ఈ షట్లర్లు ఎదురుగా ఎంత బలమైన ప్రత్యర్థి ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా అస్సలు తలొగ్గరు. విజయం తప్ప మరో ఆలోచన లేని సాత్విక్, చిరాగ్ పవర్‌ఫుల్ స్మాష్‌తో ప్రత్యర్థులను వణికిస్తుంటారు. సర్వీస్ వేరియేషన్ విషయంలో తమ తప్పిదాలను సరిచేసుకొని ఏ ఒక్క బలహీనత కూడా లేకుండా ఒలిపింక్ పతక వేటకు సిద్ధమయ్యారు. ఇక, విమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్న– తనీషా క్రాస్టో జతగా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 19వ ర్యాంక్‌లో ఉన్న ఈ జోడీ కఠినమైన గ్రూప్–సిలో పోటీ పడనుంది.