మందలిస్తున్నాడన్న కోపంతో తండ్రిని చంపిన కొడుకు.. నిర్మల్‌‌‌‌ జిల్లాలో ఆగస్ట్‌‌‌‌ 31న ఘటన

మందలిస్తున్నాడన్న కోపంతో తండ్రిని చంపిన కొడుకు.. నిర్మల్‌‌‌‌ జిల్లాలో ఆగస్ట్‌‌‌‌ 31న ఘటన
  •     45 రోజుల తర్వాత డెడ్‌‌‌‌బాడీని గుర్తించిన పెంపుడు కుక్క

    భైంసా, వెలుగు : తరచూ మందలిస్తున్నాడన్న కోపంతో ఓ మైనర్‌‌‌‌ తన తండ్రిని హత్య చేసి పొలం వద్ద పూడ్చిపెట్టాడు. కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌‌‌‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ పెంపుడు కుక్క డెడ్‌‌‌‌బాడీని గుర్తించడం, పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో 45 రోజుల తర్వాత హత్య విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నిర్మల్​జిల్లాలో జరిగింది. 

కేసుకు సంబంధించిన వివరాలను నిర్మల్‌‌‌‌ ఎస్పీ జానకీ షర్మిల బుధవారం భైంసాలోని క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... తానూర్‌‌‌‌ మండలం ఏల్వి గ్రామానికి చెందిన వన్నెవాడ్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ (49) ఆగస్ట్‌‌‌‌ 31 నుంచి కనిపించకుండా పోయాడు. వారం రోజుల తర్వాత కుటుంబసభ్యులు తానూర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌‌‌‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 13న లక్ష్మణ్‌‌‌‌ కుటుంబ సభ్యులకు చెందిన పెంపుడు కుక్క పొలం పక్కన పొదల మాటున తవ్వడంతో డెడ్‌‌‌‌బాడీ ఆనవాళ్లు కనిపించాయి. 

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అడిషనల్‌‌‌‌ ఎస్పీ అవినాశ్‌‌‌‌కుమార్‌‌‌‌, ముథోల్‌‌‌‌ సీఐ మల్లేశ్‌‌‌‌, ఎస్సై జుబేర్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని చనిపోయింది లక్ష్మణ్‌‌‌‌గా గుర్తించారు. అతడి 17 ఏండ్ల కొడుకుపై అనుమానం రావడంతో అతడిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. చదువుకోవాలని తరచూ మందలిస్తుండడం, ఆగస్ట్‌‌‌‌ 31న పొలం వద్దకు వెళ్లిన టైంలో తిట్టడంతో గొడ్డలితో దాడి చేసి చంపి పొలం వద్దే పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడని ఎస్పీ వివరించారు.