ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా గంజాయి దందా...!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా గంజాయి దందా...!
  • గంజాయి దందా ఆగేనా?
  • జిల్లాలో అడ్డూ అదుపు లేకుండా రవాణా      
  • స్టూడెంట్లే ​టార్గెట్​గా విస్తరిస్తున్న మాఫియా 
  • గంజాయి సిగరెట్స్, లిక్విడ్ గంజా అమ్మకాలు 
  • బాల్కొండలో ఎక్కువగా అమ్ముతున్రని ఆరోపణలు
  • నిఘా పెంచి కట్టడి  చేయాలని డిమాండ్​


నిజామాబాద్,  వెలుగు: ఉమ్మడి జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. గంజాయి సిగరెట్లు, లిక్విడ్​గంజాయిని అడ్డూ అదుపు లేకుండా అమ్ముతున్నారు. రోడ్లపై చిన్న షాపు నుంచి హోల్ సేల్ షాపుల వరకు అన్నింటిలోనూ యథేచ్ఛగా గంజాయి దొరుకుతోంది.   ఓపెన్​ మార్కెట్​లో విచ్చలవిడిగా అమ్ముతున్నా కంట్రోల్​  చేయాల్సిన సంబంధిత శాఖలు  కంట్రోల్​ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.  ఇటీవల జిల్లా బార్డర్​ ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడడంతో జిల్లాలో కలకలం రేగుతోంది.  

బార్డర్ జిల్లాల నుంచి రవాణా..  

మహారాష్ట్రతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ ,  నాందేడ్​జిల్లాలో గంజాయి విస్తృతంగా సాగవుతోంది. జుక్కల్, బోధన్ ప్రాంతాల మీదుగా జిల్లాలోకి రవాణా  జరుగుతోందని తెలుస్తోంది.   బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి కారు  దగ్ధమై ఇద్దరు చనిపోయారు. ప్రమాదానికి కారణమైన లారీలో నిషేదిత మత్తు పదార్థాలున్నాయి. బోధన్​ టౌన్​ లో 11 నెలల కింద రూ. 15 లక్షల విలువైన నిషేధిత మత్తు పదార్థాలను పోలీసులు సీజ్​ చేశారు. ఇందులో  రూ. 5 లక్షల విలువైన గంజాయి సిగరెట్స్​ ను పోలీసులు పట్టుకున్నారు.  లక్షల రూపాయల విలువచేసే  గంజాయి సిగరె ట్లు దొరికాయి.

ఓపెన్​గా అమ్మకాలు..

పొగాకు మోతాదు తక్కువ, గంజాయి ఎక్కువ ఉన్న సిగరెట్లకు యువకులు అడిక్ట్​అవుతున్నారు. గంజాయి  సిగరెట్లు లోకల్​లోనే  తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్​, డిగ్రీ స్టూడెంట్లు లిక్విడ్​ గంజాయి, సిగరేట్లను తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో  గంజాయి సిగరెట్లు కూడా నార్మల్​ సిగరెట్​ధరలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.   హాషిష్ ఆయిల్’ ను జిల్లా పోలీసులు, ఎక్సైజ్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున సీజ్  చేశారు.   గంజాయి వినియోగం వల్ల లంగ్స్​క్యాన్సర్​ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో నిషేదిత గంజాయి, మత్తు పదార్థాల వినియోగంతోనే యువత చనిపోతున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.  

నిఘా ఫెయిల్..​ 

జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా విభాగం ఫెయిలయ్యింది. ఎక్సైజ్,​ పోలీస్​ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  మహారాష్ట్ర  బార్డర్​లోని సలాబాత్​ పూర్, సాలూరా, కందకుర్తి చెక్​పోస్ట్ ల తనిఖీల్లో నిర్లక్ష్యం వల్ల  గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు  చెప్తున్నారు. 

మంత్రి సమీక్ష

మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని  3 రోజుల కింద రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు.  ఎక్సైజ్, పోలీస్​ శాఖ ఆఫీసర్లతో  రివ్యూ నిర్వహించారు.  గంజాయితో పట్టుబడితే ఎంతటి వారినైనా  వదిలిపెట్టొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అయితే మంత్రి నియోజకవర్గం బాల్కొండ సెగ్మెంట్ లోనే  గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 


బార్డర్​లో నిఘా పెంచాం


గంజాయి రవాణా కట్టడికి బార్డర్​లో  నిఘా పెంచాం. లోకల్​లో గంజాయి సిగరెట్లు తయారు చేస్తున్నట్లు తెలిసింది.  సంబంధిత శాఖల కోఆర్డినేషన్​తో తనిఖీలు చేస్తాం. యువత గంజాయికి అలవాటు పడకుండా రవాణా చేసే వారి సమాచారం ఇవ్వాలి.


- కేఆర్​నాగరాజు, సీపీ నిజామాబాద్ 

మాఫియాపై నిఘా పెంచాలి 

గంజాయి మాఫియాను కంట్రోల్ చేసేందుకు పోలీసుల నిఘా పెంచాలి. ​ మాఫియా కాలేజ్ స్టూడెంట్లను టార్గెట్​చేస్తుంది. నేరుగా కాలేజీల వద్దకే గంజాయి సిగరెట్లను సరఫరా చేస్తున్నారు. రైల్వేస్టేషన్, శివారు కాలనీలు, కాలేజీల వద్ద గంజాయి సిగరెట్లు విక్రయిస్తున్నారు. 


- వేణురాజ్,​  ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు