కరీంనగర్/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. నిరుడు ఇదే వారంతో పోలిస్తే 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరు, సూర్యాపేట జిల్లా శాంతినగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్ల పాడులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రమంతా ఎండలు మండిపోతుండటం, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
ఏమైనా అత్యవసర పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం అడుగుబయట పెట్టడం లేదు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు.. మధ్యాహ్నం బోసిపోయి కనిపిస్తున్నాయి. సాయంత్రమైనా వడగాడ్పుల వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సింగరేణి ఏరియాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఓపెన్‌కాస్ట్ మైన్స్ల్లో కార్మికులు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఏసీలు, కూలర్లు లేకపోవడంతో ప్రధానంగా గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు.
రెడ్ జోన్ అంచున 11 జిల్లాలు
రాష్ట్రంలో 11 జిల్లాలు రెడ్ జోన్ అంచున ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం(44.5 డిగ్రీలు), సూర్యాపేట(44.5), నల్గొండ (44.5), మహబూబాబాద్ (44.4), ములుగు (44.4), మంచిర్యాల (44.4), కుమ్రంభీం అసిఫాబాద్(44.4), వనపర్తి (44.3), ఖమ్మం (44.3), జగిత్యాల (44.1), కరీంనగర్ (44) జిల్లాల్లో 44 డిగ్రీలపైనే టెంపరేచర్ నమోదవుతున్నది. మరో హాఫ్ డిగ్రీ, డిగ్రీ దాటితే ఈ జిల్లాలు వాతావరణ శాఖ లెక్క ప్రకారం రెడ్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జనగాం, జోగులాంబ గద్వాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. మిగతా జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
ఎండలు, వడగాడ్పులతో రాష్ట్రంలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. నిర్మల్ పట్టణం లోని జీఎన్ఆర్ కాలనీ కి చెందిన స్వర్ణలత (45) అనే మహిళ మూడురోజుల క్రితం వడ దెబ్బతో చనిపోగా, ఇదే జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లికి చెందిన హమాలీ చిన్న పోశెట్టి శనివారం మృతి చెందాడు. మక్కజొన్న తూకం వేయడానికి వెళ్లిన పోశెట్టికి వడదెబ్బ తగిలింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగరాయ్ గ్రామానికి చెందిన కన్నెబోయిన కోటమ్మ (50) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. ఈ నెల 4న ఇందల్వాయి మండలం డొంకల్ తాండాలో రమావత్ అఖిల్ (5) అనే బాలుడు వడదెబ్బతో మరణించగా, అంతకుముందు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్ కు చెందిన కొలకాని అక్షయ్(13) వడదెబ్బతో చనిపోయాడు. అక్షయ్ కొడిమ్యాల మాడల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ మరణాలు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.