కవిత ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

కవిత ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

బీజేపీ ఎంపీ అర్వింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మాటలతో మొదలైన వివాదం.. ఇళ్లపై దాడుల వరకు వెళ్లింది.  ఉదయం ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్  కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

మరోవైపు  అర్వింద్ ఇంటిపై దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలు కూడా  ప్రగతి భవన్ ను ముట్టడికి బయల్దేరారు. దీంతో పోలీసులు,బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తాజా పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ లోని కవిత ఇంటి వద్ద పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశముండటంతో భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. మరోవైపు అర్వింద్ ఇంటిపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.