నిజామాబాద్లో కుండపోత వర్షం..చెరువుల్లా మారిన రోడ్లు

నిజామాబాద్లో కుండపోత వర్షం..చెరువుల్లా మారిన రోడ్లు

నిజామాబాద్ లో అర్థరాత్రి వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి నిజామాబాద్ నగరం తడిసిముద్దయింది. రోడ్లపై వరదనీరు చెరువులను తలపించింది. నిజామాబాద్ నగరం అంతా నీటిమయం అయింది.దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. 

బీభత్సమైన వర్షానికి నిజామాబాద్ నగరంలోని రైల్వే  కమాన్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి మొత్తం నీటిమయం అయింది. మోకాళ్ల లోతు కంటే ఎక్కువగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు నీటిలోనే ఆగిపోయాయి.  వాటిని తోసుకుంటూ వెళ్లలేక వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. 

నిజామాబాద్ నగరంలో ఎక్కడికక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు నిజామాబాద్ నగర కార్పొరేషన్ పై మండిపడ్డారు. భారీ వర్షం కురిస్తే కనీసం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రోడ్లు, అండర్ పాస్ బ్రిడ్జిల్లో నీరు నిలిస్తే కార్పొరేషన్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.