హైదరాబాద్ లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యవస్తం

హైదరాబాద్ లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యవస్తం

గ్రేటర్ సిటీతో పాటు శివార్లలో మంగళవారం తెల్లవారుజామున పడిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరగా.. లోతట్టు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై నీరు చేరడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వారు ట్రాఫిక్ జామ్​తో ఇబ్బందిపడ్డారు. ఎర్రగడ్డ నుంచి మూసాపేట రూట్​లో భారీగా వర్షపు నీరు రావడంతో ట్రాఫిక్, బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ రూట్​ను క్లోజ్ చేసి మోటార్లతో నీటిని తొలగించారు. దీంతో మూసాపేట వై జంక్షన్, భరత్ నగర్, కూకట్ పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

కూకట్​పల్లి బస్ డిపోలో మోకాలి లోతు నీరు చేరింది. లంగర్ హౌస్ లోని లక్ష్మీనగర్, ప్రశాంత్ నగర్, నదీంకాలనీ, షేక్ ఓయూ కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు, డ్రైనేజీ వచ్చి చేరింది. ఇంట్లో సామగ్రి తడిసిపోయిందని స్థానిక జనం వాపోయారు. పద్మారావునగర్​లోని బలరాం కాంపౌండ్ ప్రాంతంలో గ్రేవ్ యార్డ్ ప్రహరీ కూలింది. అది పక్కనే ఉన్న కరెంట్ స్తంభంపై పడటంతో ఆ స్తంభం విరిగి ఓ ఇంటిపై పడింది. ఆ టైమ్ లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మోకాలి లోతు నీరు ఉండటంతో బల్దియా అధికారులు ఆ రూట్​ను క్లోజ్ చేశారు. పురానాపూల్ బ్రిడ్జి ఏరియాతో పాటు జియాగూడలోని మూసీ నది పరివాహక ప్రాంతంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యటించారు. మూసీ పరివాహక ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా 
బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. 

బేగంపేట, ఫతేనగర్, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, అల్వాల్, బోయిన్ పల్లి, బొల్లారం, ఉప్పల్, కాప్రా, మల్కాజిగిరి, రామంతాపూర్ ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు చేరింది. మణికొండ, కిస్మత్ పురా, బండ్లగూడ జాగీర్, గండిపేట పరిధిలోని కాలనీలు నీట మునిగాయి. పీవీ ఎక్స్ ప్రెస్ వే  పిల్లర్ నం. 296 , 191 వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరడంతో  రాకపోకలు ఆగిపోయాయి. బహదూర్ పల్లిలోని బాబాఖాన్ చెరువు అలుగు పారడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ట్రాన్స్ కో ఎండీ రఘుమారెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ  దాన కిషోర్,  ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తో ఫోన్ లో  మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.