దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తరాదిలో వడగాడ్పులు

దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తరాదిలో వడగాడ్పులు

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు దక్షిణాదిన భారీ వర్షాలు పడుతుండగా.. ఉత్తరాదిన మాత్రం సమ్మర్ పీక్ స్టేజీకి చేరి తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. దక్షిణాదిన కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్ తోపాటు ఉత్తరాదిన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్​లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానా, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ లోనూ గురువారం టెంపరేచర్లు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 

ప్రధానంగా రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు హీట్ వేవ్స్ ముప్పు ఉందని, వృద్ధులు, పిల్లలు, పేషెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని భారత వాతారణ శాఖ (ఐఎండీ) వార్నింగ్ జారీ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరిగిపోవడంతో కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ సమ్మర్ సీజన్ లో విద్యుత్ పీక్ డిమాండ్ గురువారం అత్యధికంగా 236.59 గిగావాట్లకు చేరిందని శుక్రవారం కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.

కేరళలో కుండపోత 

కేరళలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ ప్రకటించింది. పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేసింది. కుండపోత వర్షాలతో కొచ్చి, త్రిసూర్ నగరాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై రెవెన్యూ మంత్రి కె. రాజన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గత కొద్ది రోజుల్లో 11 మంది చనిపోయారని ప్రకటించారు. నీటిలో మునిగి ఆరుగురు, నీటి గుంతల్లో పడి ఇద్దరు, పిడుగులు పడి ఇద్దరు, గోడ కూలి ఒకరు మృతిచెందినట్టు తెలిపారు. కొజికోడ్ జిల్లాలో 24 గంటల్లోనే 22.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇక తమిళనాడులోనూ గురు, శుక్రవారాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

 రాజస్థాన్ లో 12 మంది మృతి 

రాజస్థాన్​లో జనం పగటిపూట తీవ్రమైన వడగాడ్పులతో, రాత్రి పూట ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నైట్ టెంపరేచర్లు సైతం 30 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా ఫలోడీలో 36.8, కోటలో 33, జైపూర్ లో 32.1, అజ్మీర్ లో 31.9, బికనీర్ లో 31.3 డిగ్రీ సెల్సియస్​ల నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని బాడ్మేర్ లో గురువారం 48.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది. వడగాడ్పుల కారణంగా రాజస్థాన్​లో వారం రోజుల్లో 12 మంది హీట్ స్ట్రోక్​తో చనిపోయారని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కిరోరీ లాల్ మీనా వెల్లడించారు.

ఇండోర్ లో ట్రాన్స్ ఫార్మర్లకు కూలర్లు 

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో గురువారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సిగ్నల్ టైమ్ ను పోలీసులు 11 సెకన్లకు తగ్గించారు. ట్రాన్స్ ఫార్మర్లను చల్లబర్చేందుకు విద్యుత్ సిబ్బంది పెద్ద పెద్ద ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీనగర్​లో 13 ఏండ్లలోనే అత్యధిక వేడి

జమ్మూకాశ్మీర్​లోని శ్రీనగర్​లో టెంపరేచర్లు 13 ఏండ్లలోనే అత్యధిక స్థాయికి చేరాయి. శ్రీనగర్ లో గురువారం 32.2 డిగ్రీ సెల్సియస్ ల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో 2011, మే 20న ఇక్కడ 32.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.

రేపు బెంగాల్ తీరానికి సైక్లోన్ ‘రెమాల్’ 

ప్రస్తుత ప్రీ మాన్ సూన్ సీజన్​లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి సైక్లోన్ ‘రెమాల్’ ఆదివారం అర్ధరాత్రి బెంగాల్​లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్​లోని ఖేపుపడ మధ్య తీరాన్ని దాటనుందని ఐఎండీ శుక్రవారం వెల్లడించింది. శనివారం ఉదయం కల్లా సైక్లోనిక్ స్టార్మ్​గా, రాత్రి కల్లా తీవ్రమైన సైక్లోనిక్ స్టార్మ్ గా మారుతుందని తెలిపింది. గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.