
హాలియా/యాదాద్రి/భూదాన్ పోచంపల్లి/మేళ్లచెరువు(చింతలపాలెం)/ నేరేడుచర్ల, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం హాలియా పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది. అనుముల , రామడుగు, హజారిగూడెం గ్రామాల వద్ద హాలియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలపై అలుగు పారుతోంది. నిడమనూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు, తుమ్మడం పెద్ద చెరువు నిండి అలుగు పోస్తున్నాయి. బంకాపురం, నిడమనూరు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక-–వెల్వర్తి రోడ్డుపై వరద నీరు పారుతోంది. బుధవారం కలెక్టర్హనుమంతరావు వరదను పరిశీలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దొండపాడు ఎర్రవాగు, బై పాస్ రోడ్ ను పరిశీలించారు. వరద తగ్గే వరకు రాకపోకలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు. వర్ష తీవ్రతను బట్టి చింతలపాలెం మండల కేంద్రంలోని హైస్కూల్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. కిష్టాపురంలో ఎన్ఎస్పీ కాలువకు పడిన గండితో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని రుద్రవెల్లి బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసీ నదిని రాచకొండ సీపీ సుధీర్‌బాబు పరిశీలించారు.
రుద్రవెల్లి నుంచి జూలూరుకు లో లెవెల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. నేరేడుచర్ల పట్టణం, మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు 75.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మున్సిపాలిటీ పరిధి జాన్ పహాడ్ రోడ్డులోని లోలెవెల్ కల్వర్టు పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. స్థానిక బైపాస్ రహదారి సమీపంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు నీటమునిగాయి. పెంచికల్ దిన్న, కల్వల్ దిన్న శివారుల్లో సుమారు 100 ఎకరాల్లో పొలాలు నీటమునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను, కాల్వలను పరిశీలించి, నిల్వ ఉన్న నీటిని జేసీబీతో తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.