
సూర్యాపేట, కేతేపల్లి (నకిరేకల్), భూదాన్ పోచంపల్లి, దేవరకొండ, తుంగతుర్తి, వెలుగు : భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. పలుచోట్ల వరదనీరు కాలనీల్లోకి రావడంతో చెరువులా మారాయి. బ్రిడ్జిలు, రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో 12వ వార్డు పూర్తిగా జలమయమైంది. విషయం తెలుసుకున్న సూర్యాపేట కలెక్టర్ తొండ గ్రామానికి వెళ్లి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
కేతేపల్లి మండలం భీమారం వద్ద ఉన్న లో లెవల్ కాజ్ వే, మూసీ డ్యామ్ ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి నల్గొండ కలెక్టర్పరిశీలించారు. సూర్యాపేట రూరల్ పరిధిలోని ఎదురువారిగూడెం భీమారం వంతెన వద్ద మూసీ నది ప్రవాహాన్ని సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలూనాయక్, అధికారులతో కలిసి ఎస్పీ నరసింహ పరిశీలించారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు –-రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లెవల్ బ్రిడ్జి మీదుగా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జి మీదుగా మూసీ నీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు ముందస్తుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కొండమల్లేపల్లి మండలం గౌరికుంట తండాలోని వీధులు చెరువులు కుంటలు తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.