సీసీఐ కేంద్రాల ఏర్పాటులో డిలే..

సీసీఐ కేంద్రాల ఏర్పాటులో డిలే..

పత్తి అమ్మేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో డిలే కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు.

 

సిద్దిపేట, వెలుగు  : ఈసారి సంగారెడ్డి జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో, సిద్దిపేట జిల్లాలో 1.43 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. కాగా సంగారెడ్డిలో 50 లక్షల క్వింటాళ్లు, సిద్దిపేటలో 20 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడి వస్తుందని  అధికారుల అంచనా. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పత్తిని ఏరుతున్నారు. 

రెండు విధాలా నష్టం.. 
అధిక వర్షాలతో తెగుళ్లు సోకి పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి రంగుమారింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి వుండగా, ఈసారి అందులో సగమే చేతికందే పరిస్థితి ఉంది. పంటకు ప్రభుత్వ మద్దతు ధర లభిస్తే రైతులకు కొంత ఊరట కలిగేది. కానీ ఇంకా సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కులేక ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది.  ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ పత్తికి రూ.6,380  కాగా.. దళారులు మాత్రం రూ.6 వేల లోపే చెల్లిస్తున్నారు. అటు అధిక వర్షాలతో.. ఇటు తక్కువ ధరలతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టెండరింగ్ ప్రక్రియలో జాప్యం..!
టెండరింగ్ ప్రక్రియ ఆలస్యం కారణంగానే జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తొలుత మిల్లు యాజమన్యాలకు సీసీఐకి మధ్య దూది శాతంతో పాటు పెండింగ్ ఇన్సెంటివ్స్ విషయమై వ్యత్యాసాల వల్ల టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. కొద్ది రోజుల కింద రాష్ర్ట స్థాయిలో ఒప్పందాలు కుదరడంతో టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి జిన్నింగ్ మిల్లులు అంగీకరించాయి. సిద్దిపేట జిల్లాలో 24, సంగారెడ్డిలో 19 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ప్రక్రియ పూర్తి అయితే ఈ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. సిద్దిపేట జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వచ్చే వారం అన్ని శాఖలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.  నవంబర్​ రెండో వారంలో కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పండిన పత్తిని అప్పటి వరకు దాచుకునే పరిస్థితులు లేవని, వర్షాలు వస్తే  మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

నష్టం జరగకుండా చూడాలె
ఈసారి పత్తిపంట దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. వర్షాలు ఎక్కువ పడి ఆగమైనం. ఇప్పుడు సర్కారు నుంచి మద్దతు ధర అందక.. అమ్ముకునేందుకు  కేంద్రాలు లేక మస్తు ఇబ్బంది పడుతున్నం. సీజన్  ప్రారంభంలోనే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికైనా త్వరగా ప్రారంభించాలె. రైతులకు నష్టం జరగకుండా చూడాలె. 
- శ్రీనివాస్ రెడ్డి, రైతు గాగిళ్లపూర్

త్వరలోనే 
సీసీఐ కేంద్రాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లాలో త్వరలోనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే వారంలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలతో  ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని అమ్ముకోవద్దు. 
-  రియాజ్, ఏడీ మార్కెటింగ్