
దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 24 మంది మృతి చెందారు. మరో 14 మంది తప్పిపోయినట్లు అధికారులు జులై 15న తెలిపారు. ముంపు గ్రామాల ప్రజల్ని ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఓ డ్యాం పొంగి పొర్లుతోంది. తప్పిపోయిన వారిలో కొందరు రిజర్వాయర్ లో పడిపోయారని అధికారులు తెలిపారు.
మృతుల్లో ఎక్కువగా ఉత్తర జియోంగ్ సాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం ఇళ్లు కొట్టుకుపోయాయని అధికారులు వెల్లడించారు. గోసన్ డ్యాం పొంగి ప్రవహించడంతో సెంట్రల్ కౌంటీ ఆఫ్ గోసన్ లోని 6,400 మందికి పైగా నిర్వాసితులను ఖాళీ చేయించాలని ఆదేశించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తర జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లో నది పొంగి ప్రవహించడంతో తప్పిపోయిన వారిలో కొందరు కొట్టుకుపోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది. పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయని వారు చెప్పారు. మరి కొన్ని రోజుల వరకు వర్షాలు తగ్గకపోవచ్చని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.