
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్‌బీ, దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షం కారణంగా నగరం నీట మునిగింది. రాగల 3 రోజులు గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 40°C నుండి 43 °C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.ఆది, సోమ వారాల్లో ( మే 28, 29) ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ( మే 29) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
పలు రాష్ట్రాలకు ఆరంజ్ అలెర్ట్
భారత వాతావరణ శాఖ (IMD) హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రం నుండి తేమ కారణంగా వాయువ్య భారతదేశంలో ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 5 రోజుల పాటు వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య యూపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, ఈశాన్య రాజస్థాన్, యూపీలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సోమా సేన్ రాయ్ తెలిపారు.
ఢిల్లీలో వర్షాలు
అంతకుముందు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పు ఉత్తర భారతదేశంలో ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తోంది. మే 27న కూడా ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వర్షం మరియు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.