హమ్మయ్యా..  వానలు పడుతున్నయ్

హమ్మయ్యా..  వానలు పడుతున్నయ్

ఖమ్మం, వెలుగు: జిల్లాలో రైతులకు ఊరట దక్కింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వానాకాలం పంటలపై ఆశలు చిగురించాయి. జులై రెండో వారం వరకు జిల్లాలోని చాలా మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూన్​ముగిసేవరకు జిల్లాలో సగటు కంటే 60శాతం తక్కువగా వానలు పడ్డాయి. దీంతో ఈసారి మెట్ట పంటల సాగు పడిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పత్తి సాగు కూడా గతేడాది పండిన లక్షన్నర ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు తగ్గింది. పత్తి అదును దాటడంతో, ఇప్పుడు రైతన్నలు మిర్చి సాగుపై మొగ్గుచూపుతున్నారు.

సొంతంగా మిర్చి నారు పోసుకునే సమయం లేక నర్సరీల్లో ఇప్పటికే పెంచిన నారు కోసం పరుగులు తీస్తున్నారు. ఇక నీళ్లున్న రైతులు కరివెద పద్ధతిలో కొందరు వరి సాగు చేస్తుంటే, మరికొందరు పొలాలు దున్నుకుంటూ వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ లో వర్షాలు పడకముందే పత్తి విత్తనాలు పెట్టుకున్న రైతులు మాత్రం అవి ఎండలకు మగ్గిపోవడంతో, వాటిస్థానంలో రెండుసార్లు మళ్లీ విత్తనాలు పెట్టుకున్నారు. ఈ కారణంగా మూడోసారి పెట్టిన పత్తి విత్తనాలు మొలకెత్తినా, పెట్టుబడి ఖర్చు పెరిగిందని బాధపడుతున్నారు. 

వానల ఆలస్యంతో రైతులకు తిప్పలు..

జులైలో సాధారణ వర్షపాతం167.6 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికే జిల్లాలో198 మిల్లీ మీటర్లుగా నమోదైంది. గడిచిన 22రోజుల్లో16రోజులు వర్షాలు కురిశాయి. జిల్లా యూనిట్ గా సాధారణస్థాయిలో వర్షం పడిందని అనిపిస్తున్నా, మండలాల వారీగా చూస్తే మాత్రం నాలుగు మండలాల్లో ఇంకా సాధారణ స్థాయికంటే 44శాతం తక్కువే ఉంది. నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, మధిర మండలాల్లో తక్కువ వానలు పడ్డాయి. మిగిలిన మండలాల్లో 8 చోట్ల అధిక వర్షపాతం నమోదు కాగా, 9 మండలాల్లో పర్వాలేదన్నట్లు వర్షాలు కురిశాయి. ఈనెల మొదటి వారం వరకు పత్తి రైతులు వర్షాల కోసం ఎదురుచూశారు. విత్తనాలు నాటుకొని, వానలు కురవక గింజలు దక్కించుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కొందరు, బిందెలతో నీళ్లు మోసి మరికొందరు అవస్థలు పడ్డారు. తీరా అవి మొలకెత్తకపోవడంతో వాటి స్థానంలో మళ్లీ విత్తనాలు నాటారు. దీంతో విత్తనాల ఖర్చు, ట్రాక్టర్​కిరాయిలు రెట్టింపయ్యాయి. రెండు, మూడోసారి పెట్టిన విత్తనాలు ఇప్పుడు వర్షాల కారణంగా మొలకెత్తుతుండడంతో ఒకవైపు సంతోషంగా ఉన్నా, మరోవైపు పెట్టుబడి ఎక్కువైన కారణంగా దిగుబడి కలిసి వస్తుందా లేదా అనే టెన్షన్​లో ఉన్నారు. 

చాలామంది మిర్చి వైపే మొగ్గు..

వారం రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో రైతులు ఎక్కువగా పొలం పనుల్లోనే నిమగ్నమయ్యారు. బోర్ల కింద, బావుల కింద ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు ఇప్పుడు దుక్కులు దున్నుకొని నాట్లు వేస్తున్నారు. మరికొందరు డైరెక్ట్​గా కరివెద సాగుతో దుక్కి దున్ని వడ్లు చల్లుతున్నారు. ఇంకొందరు వరినారు కొని నాట్లు వేస్తున్నారు. ఇక చాలామంది రైతులు మిర్చి సాగు కోసం కూసుమంచి, కొణిజర్ల, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్​మండలాల్లో గల ప్రైవేట్ నర్సరీల్లో వ్యాపారులు మిర్చి నారు పెంచి అమ్ముతున్నారు. దీంతో వాటికి గిరాకీ పెరిగింది.

12 ఎకరాల్లో నాటు వేస్తున్న..

ఇన్ని రోజులు వర్షాలు లేక బోరు కింద వరి నారు పోసి ఎదురుచూసినం. మొన్నటి వరకు వానల్లేక బోరు నీటి ద్వారా పొలం దున్నేందుకు దుక్కి తడిసే పరిస్థితి లేదు. ఇప్పుడు వానలతో నేల తడిచి పదునుగా ఉంది. ఇప్పుడు బోరు, బావి నీళ్లతో దుక్కులు దున్ని నాట్లు వేసేందుకు సిద్ధం చేస్తున్నం. 

- పందిరి దామోదర్​రెడ్డి, రైతు, గురువాయిగూడెం

కౌలు ఖర్చు అయినా వస్తుందో లేదో..

ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేసిన. ఇప్పటి వరకు మూడుసార్లు విత్తనాలు పెట్టినం. వర్షాలు పడక రెండు సార్లు గింజలు మొలవలే. నెలన్నర నుంచి వర్షాల కోసం ఎదురు చూస్తున్నం. ఇన్నాళ్లకు వరుణుడు కరుణించిండు. మూడోసారి పెట్టిన విత్తనాలు మొలకెత్తినయ్. ఎడతెరపి లేని వర్షాలతో చెత్త పెరుగుతుంది. కూలీలతో తీయించాలి. విత్తనాల ఖర్చు పెరిగింది. కౌలు వస్తుందో రాదోనని ఆందోళనగా ఉంది.     - 

తీగల ధనమూర్తి, కౌలు రైతు, మద్దులపల్లి