ముంబై ఆగమాగం .. కుండపోతతో అతలాకుతలం

ముంబై ఆగమాగం .. కుండపోతతో అతలాకుతలం
  • జన జీవనం అస్తవ్యస్తం.. ఎంఎంటీఎస్​ రైళ్లు, విమానాలు బంద్
  • ఒక్కరోజులోనే ఈస్ట్ ముంబైలో 16.86, వెస్ట్ ముంబైలో 16.59 సెంటీమీటర్ల వర్షం
  • కొన్ని ప్రాంతాల్లో 6 గంటల్లోనే 30 సెం.మీ
  • లోతట్టు ప్రాంతాలు మునక
  • స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. సిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే ట్రాక్ లపై నిలిచిపోయిన నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నారు. సిటీబస్సులు నిలిచిపోయాయి. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముంబైలో ఒక్కరోజులోనే 16.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. ముంబై సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వర్షం దంచికొట్టింది. దీంతో ఒక్కరోజులోనే ముంబైలో 16.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈస్ట్  ముంబైలో 16.86, వెస్ట్  ముంబైలో 16.59 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

సిటీలోని కొన్ని ప్రాంతాల్లో 6 గంటల్లోనే 30 సె.మీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్  ఎక్కడికక్కడ స్తంభించి  వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎంఎంటీఎస్  రైళ్లు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం ఒక్కరోజే 50 ఫ్లైట్లను క్యాన్సిల్  చేశారు. ముంబైకు చేరుకోవాల్సిన కొన్ని విమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్  తదితర నగరాలకు దారి మళ్లించారు.

వర్షం కారణంగా చాలా మంది ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో గంటల తరబడి ఇరుక్కుపోయారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు కోరారు. రైల్వే ట్రాక్ లపై నిలిచిపోయిన నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నారు. అలాగే సిటీబస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. రోడ్లపై నీరు చేరడంతో 40 బస్సు రూట్లను రద్దు చేశారు.

ఇక స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షం కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధాన్  భవన్ కు చేరుకోకపోవడంతో అసెంబ్లీ, మండలి సమావేశాలను వాయిదా వేశారు. కాగా.. వచ్చే 24 గంటల్లో ముంబై సిటీతో పాటు సబర్బన్  ఏరియాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

థానెలో కొట్టుకుపోయిన బ్రిడ్జి

పక్కనున్న థానె, రాయ్ గఢ్  జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. థానెలో వర్షానికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రమాదంలో ఉన్న 54 మందిని అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాదాపు 275 ఇండ్లు దెబ్బతిన్నాయి. 20 వాహనాలు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడడంతో 25 మందిని అధికారులు ఖాళీ చేయించారు.

అలాగే పొరుగునున్న రత్నగిరి హిల్  ఫోర్టు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇరుక్కుపోయిన టూరిస్టులు, ట్రెక్కర్లను రక్షించి ఖాళీ చేయించారు. కోటను ఈనెల 31 వరకు బంద్  చేశారు. రాయ్ గఢ్  జిల్లాలోని తాలాలో అత్యధికంగా 28.7 సెం.మీ వర్షం కురిసింది. హసాలాలో 27.3, మురుద్ లో 25.5, అలీబాగ్ లో 17, శ్రీవర్ధన్ లో 13, రోహాలో 9.3, మాంగావ్  లో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు నివాస ప్రాంతాల్లో ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు. వర్షాల కారణంగా రాయ్ గఢ్  కోటను బంద్  చేశారు.

ఉత్తరప్రదేశ్​లో వరదలు

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద వస్తోంది. దీంతో డ్యాంల నుంచి నీటిని విడుదల చేయడంతో పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్​లోని పలు జిల్లాల్లో వరద ముంచెత్తింది. వరద నీటికి పిలిభిత్, లఖీంపూర్, ఖుషీనగర్, బలరాంపూర్, స్రావస్తి, గోండ్  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 

ఇక హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల కారణంగా  70 జాతీయ రహదారులను బంద్  చేశారు. కాగా, గోవాలో గత మూడు రోజులుగా కురుస్తున్న  వర్షాలకు  లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని స్కూళ్లకు  ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నార్త్  గోవాలోని కుందైమ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్​లో భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు చనిపోయారు. గత 24 గంటల్లో పనాజీలో 36, క్యూపెంలో 1735  సెం.మీ వర్షపాతం రికార్డయింది. ప్రజలంతా ఇండ్లలోనే  ఉండాలని సీఎం ప్రమోద్  సావంత్  సూచించారు.

రైలు దిగి ట్రాక్ పై నడిచిన మంత్రి 

రైల్వే ట్రాక్​పై వరద నీరు చేరడంతో హౌరా–ముంబై ట్రెయిన్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మంత్రి అనిల్  పాటిల్, ఎమ్మెల్సీ అమోల్ మిట్కారీ రైలు దిగి ట్రాక్​పై నడిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఇక కుండపోత వానపై సీఎం ఏక్ నాథ్  షిండే అధికారులతో రివ్యూ నిర్వహించారు.

బృహన్ ముంబై మునిసిపల్  కార్పొరేషన్  కంట్రోల్​ రూంను సీఎం పరిశీలించారు. మరోవైపు చున్నాభాటిలో ఓడరేవు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఇక, గోవండి ఏరియాలో 31.5, పోవాయ్​లో 31.4, అంధేరీలోని మాల్పా డోంగ్రీలో 29.2, చకాలాలో 27.8, ప్రతీక్షా నగర్ లో 22, సేవ్ రీ కోలివాడలో 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.