
- 2 గంటల్లో 90 మిల్లీమీటర్ల వాన
- నదులను తలపిస్తున్న వీధులు
- లోతట్టు ప్రాంతాల్లోకి వరద
- 400 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్‌లు
ముంబై : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలో కురిసిన భారీ వర్షానికి వరదనీరు పోటెత్తింది. దాంతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ టీములను రంగంలోకి దించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. నాగ్‌పూర్ సిటీలో వరద ప్రభావంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు.
శనివారం తెల్లవారుజామున రెండు గంటల్లో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. భారీ వర్షంతో అంబజారి సరస్సు పొంగిపొర్లుతోందని.. చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయన్నారు. వరదల కారణంగా ఓ వృద్ధురాలు చనిపోగా..14 పశువులు ప్రాణాలు కోల్పోయాయని వివరించారు. సిటీలోని ఇండ్లల్లోకి నీరు చేరిందని రోడ్లన్నీ నదుల్లా మారాయని చెప్పారు.
సురక్షిత ప్రాంతాలకు 400 మంది..
పరిస్థితిని చక్కదిద్దేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) టీములు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయని ఫడ్నవీస్ వెల్లడించారు. వరద నీటిలో చిక్కుకున్న 400 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయని వివరించారు. వీరిలో స్పెషల్ స్కూల్(మూగ, చెవిటి)కు చెందిన 70 మంది స్టూడెంట్లు, ఎల్ఏడీ కాలేజీకి చెందిన 50 మంది గర్ల్స్ కూడా ఉన్నారని చెప్పారు. బాధితులందరికి ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను అందించినట్లు తెలిపారు.
వరదలపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నాగ్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడి వరద పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు అవసరమైన సౌలతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం మరింత పెరిగితే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ల అదనపు బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా, నాగ్‌పూర్‌లో రానున్న 24 గంటల పాటు వర్షాలు కురవచ్చని పేర్కొంటూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
జార్ఖండ్‌లోనూ ఒకరు..
జార్ఖండ్ రాష్ట్రంలో బుధవారం నుంచి కురుస్తు న్న ఎడతెరిపిలేని వర్షాలకు రోడ్లు, కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలాము జిల్లాలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మహిళ చనిపోయింది. భారీ వర్షానికి అప్రోచ్ రోడ్లు, అనేక కల్వర్టులు, డైవర్షన్‌లు, వంతెనలు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు రాష్ట్రంలో 977.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు.