
- 22 మండలాల్లో సాధారణం.. ఆరు మండలాల్లో అధిక వర్షం
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో వారం కింద భారీ వర్షాలు కురిసి వరదలు పారినప్పటికీ ఇంకా ఐదు మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ఒక్కో మండలాన్ని ఒక్కో రీతిలో వర్షాలు కురిశాయి. లోటు వర్షపాతం ఉన్న మండలాల్లో రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సాధారణ వర్షాలు కురిసిన మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. అధిక వర్షాలు కురిసిన ఆరు మండలాల్లో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంది.
గరిష్ఠంగా 31 శాతం లోటు..
జిల్లాలో 33 మండలాలుండగా, సీజన్‌లో 1051.7 మి.మీ. వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా. అయితే ఇప్పటివరకు 739 మి.మీ. వర్షం నమోదైంది. ఏటా ఈ అంచనాల ఆధారంగానే పంటల ప్రణాళిక సిద్ధమవుతోంది. జూన్‌లో మృగశిర కార్తెతో ప్రారంభమయ్యే వానాకాలం, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష తదితర కార్తెలతో కొనసాగి, సెప్టెంబర్ 13న పుబ్బ కార్తెతో ముగుస్తుందని రైతుల నమ్మకం. సాధారణంగా ఆరుద్ర కార్తెలోనే అధిక వర్షాలు కురిసి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలి. ఆగస్టు 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు ముందువరకు జిల్లాలోని అన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
ఆ తర్వాత ఇందల్వాయి, డొంకేశ్వర్, నిజామాబాద్ రూరల్, సౌత్, సిరికొండ, వర్ని మండలాల్లో మాత్రమే అంచనాలకు మించి గరిష్ఠంగా 54 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. 22 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే మొపాల్ మండలంలో 31 శాతం లోటు కొనసాగుతుండగా, నవీపేటలో 30 శాతం, ఆర్మూర్‌లో 23 శాతం, మెండోరాలో 22 శాతం, రెంజల్‌లో 21 శాతం లోటు వర్షపాతం ఉంది. మరో వారంలో వర్షాకాలం ముగియనుండటంతో ఈ లోటు భర్తీ అవుతుందా లేదా, అలాగే కొనసాగుతుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
5.60 లక్షల ఎకరాల్లో సాగు..
ఈ వానాకాలంలో జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి అత్యధికంగా 4.32 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 47,678 ఎకరాలు, సోయాబిన్ 37,859 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి 1,332 ఎకరాలు, కంది 855 ఎకరాలు, శనగ 514 ఎకరాలు, వేరుశనగ 356 ఎకరాల్లో పండించారు. అయితే వారం కింద కురిసిన భారీ వర్షాలతో 48,429 ఎకరాల పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మిగతా పంటలు అధిక వర్షాలు కురిసిన మండలాల్లో పుష్కలంగా పెరుగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండడంతో బోర్ల వినియోగాన్ని నిలిపివేశారు. సాధారణ వర్షాలు కురిసిన 22 మండలాల్లో పరిస్థితి సాధారణంగా ఉండగా, లోటు వర్షాలు నమోదైన మండలాల్లో రైతులు బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు.