బీభత్సమైన వర్షాలు..నదులను తలపిస్తున్న వరదలు.. ఉత్తరభారతం అతలాకుతలం

బీభత్సమైన వర్షాలు..నదులను తలపిస్తున్న వరదలు..  ఉత్తరభారతం అతలాకుతలం

భారీ వర్షాలు, వరదలకు ఉత్తర భారతం విలవిల్లాడుతోంది.  పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండిలలో బియాస్ నది డేంజర్ లెవల్లో ప్రవహిస్తోంది. బియాస్ నది ఉధృతితో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. లాహౌల్-స్పితి జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది.

హిమాచల్ లోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణశాఖ... మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కులులో భారీ వర్షాలకు రహదారి కోతకుగురైంది. కొండప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో  కొండచరియలు విరిగిపడ్డాయి.  కులు-మనాలి నుండి అటల్ టన్నెల్ వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కోటి, సన్వారాలో నదులు ఉధృతంగాప్రవహిస్తున్నాయి. మన్ పురా, నలాగఢ్ లలో చెట్లు కూలిపోవటంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లాహౌల్, స్పితి జిల్లాలో వరదలు, హిమపాతం ఏర్పడింది. 

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో జోరుగా వానలు కురుస్తున్యాయి. వర్షాలకు వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వానలకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీ వారణాసిలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతవానలకు గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది.

పంజాబ్ లో జోరువర్షాలతో జనజీవనం స్తంభించింది. పటియాలో కుండపోతవానలకు రోడ్లుపై వాననీరు పోటెత్తింది. ప్రధాన రహదారులపై మోకాలు లోతు నీటితో వాహనదారులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు అంబాలలోని పలుకాలనీలు నీటమునిగాయి.

జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నదులు ఉప్పొంగుతున్నాయి. అటు చస్సానా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ట్రక్ లోయలోపడింది. లోయ ప్రాంతంలో రోడ్లపైకి వాహనాలు రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. జమ్మూ  కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ సమీపంలో  మంచు కురుస్తోంది.