
- హైదరాబాద్‌లో నీట మునిగిన కాలనీలు
హైదరాబాద్/నెట్వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో అత్యధికంగా 21.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో కారికేలో 8.5, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7.4, ఆదిలాబాద్ నామూర్లో 6.7, చాప్రాలలో 6.5, ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్ లో 5.8, కామారెడ్డి జిల్లా హాసనపల్లిలో 5.6, మెదక్ జిల్లా నాత్నాయిపల్లిలో 5.1, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 5.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కొన్నిచోట్ల వరదలకు రోడ్లు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇంకొన్ని ఇండ్లు, చెట్లు కూలిపోయాయి.
చెరువు కట్టలకు గండ్లు..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి చెరువు లోకి భారీగా వరద చేరుతున్నది. దేశరాజుపల్లి అను బంధ గ్రామమైన ఔదరిపల్లిలోని ఔసులకుంట కట్టకు గండి పడింది. గంగాధర మండలం గట్టుభూత్కూర్చెరువు మత్తడి దుంకి కొత్తపల్లి టౌన్శివారులోని సప్టా మీదుగా 6 అడుగుల ఎత్తులో వరద పారుతున్నది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పోతారం చెరువు మత్తడి దుంకుతున్నది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని మరలపెల్లి చెరువు కట్ట తెగిపోవడంతో కడెం ప్రాజెక్టు లోకి భారీగా వరద వచ్చి చేరింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఈదుల వాగు, నెన్నెల మండలంలోని ఎర్రవాగు, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో బతుకమ్మ, సుద్దాల, పాల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
నీట మునిగిన కాలనీలు..
వేములవాడలోని బుడగ జంగాల, సిరిసిల్లలోని శాంతి నగర్ కాలనీలు నీట మునిగాయి. స్తంభంపల్లి వద్ద గంజీవాగు కల్వర్టు మీదుగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. వేములవాడ మండలం మర్రిపల్లిలోని బ్రిడ్జి వద్ద మట్టి రోడ్డు తెగిపోయింది. ఆసిఫాబాద్ జిల్లా దహెగం మండలంలో ఇండ్లలోకి వరద చేరింది. కౌటల మండలం తలోడి గ్రామానికి చెందిన గొడిసెల దేవమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. కన్నేపల్లిలోని కన్కి ప్రాజెక్ట్‌లో మత్స్యకారుల వలలు తెగి సుమారు వంద క్వింటాళ్ల చేపలు కొట్టుకుపోయాయి. జగిత్యా ల జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపులోని డాగ్ స్క్వాడ్ కేంద్రం వద్ద పెద్ద చెట్టు కూలిపోయింది.
మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వనదుర్గామాత ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. శివ్వంపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి మండలాల్లో పదుల సంఖ్యలో ఇండ్లు పాక్షికంగా కూలాయి. భద్రాద్రి వద్ద గోదావరికి వరద కొంత మేర తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, డొంగ్లి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు బంద్అయ్యాయి.
మునిగిన ఇండ్లు.. బాధితుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ బైపాస్‌ను ఆనుకుని ఉన్న దుబారిపేటలో ఇండ్లన్నీ నీట మునిగాయి. ఏటా ఇవే తిప్పలు ఎదురవుతుండడంతో గిరిజనులు శుక్రవారం హైవే పై రాస్తారోకో చేశారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. అధికారులు సర్దిచెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. నేరడిగొండ మండలంలో కుంటాల జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. వర్షాలు తగ్గే వరకు పర్యాటకులు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ ఆగమాగం..
భారీ వర్షాలకు హైదరాబాద్ ఆగమాగమైంది. చెరువులన్నీ నిండుకుండలా మారాయి. పలు చెరువులు ఉప్పొంగి కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి వరద చేరింది. సరూర్‌నగర్ చెరువు నుంచి నీళ్లు విడుదల చేయడంతో కాలనీల్లోకి వరద వచ్చింది. మూసాపేట్‌లోని ఐడీఎల్ చెరువులో నీటిమట్టం డేంజర్ లెవల్‌కు చేరింది. కుత్బుల్లా పూర్లో సూరారం చెరువు ఉప్పొంగి, గాజులరామారం డివిజన్లోని ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ నీట మునిగిం ది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలో కాలనీలు నీట మునిగాయి. మల్లంపేటలోని బతుకమ్మకుంట, బౌరంపేటలోని సింహపురి కాలనీలు నదులను తలపించాయి.
స్థానిక కొత్తకుంట బ్యాక్‌వాటర్ ఇండ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో దుండిగల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పుట్టీలను తెప్పించి 60 కుటుంబాలను బయటకు తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించారు. వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీకి 500కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఏదైనా అత్యవసరమైతే హైల్ప్ లైన్ నంబర్ 040-21111111, డీఆర్ఎఫ్ బృందాల సాయం కోసం 90001 13667 నంబర్ లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
వాగుదాటి వెళ్లిన డీఎంహెచ్‌వో
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం పంచాయతీ సీతారాంపురం గ్రామంలో సరైన వైద్యం అందక కుర్సం బాబురావు (35) మరణించారు. అదే గ్రామానికి చెందిన కుర్సం సిద్ధు (16) పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో గిరిజనులు జోలెలో మోసుకుంటూ వాగు దాటి వెంకటాపురం ఆసుపత్రికి చేర్చారు. ఈ నేపథ్యంలో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి జిల్లా డీఎంహెచ్‌వో అప్పయ్య, సిబ్బంది శుక్రవారం వాగు దాటుకుంటూ వెళ్లారు. గ్రామంలోని 166 మందికి పరీక్షలు నిర్వహించి, దోమ తెరలు పంపిణీ చేశారు.
మరో 4 రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగా రెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.