నల్గొండ జిల్లాలో వాన దంచికొట్టింది

నల్గొండ జిల్లాలో వాన దంచికొట్టింది

యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురువారం రాత్రి వాన దంచికొట్టింది. హైదరాబాద్​లో వాన కారణంగా మూసీ పొంగిపొర్లడంతో యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెంలోని భీమలింగం కత్వ లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు పారింది. దీంతో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అడ్డగూడూరు,  గోవిందపురం మధ్య నక్కల వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. వలిగొండ మండలం వర్కట్​పల్లి మధ్యలోని చెరువు కట్ట తెగింది. 

దీంతో వరదనీరు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పెండ్లికి కారులో వెళ్తున్న వారు చిక్కుకున్నారు. కారులోని ఐదుగురు వ్యక్తులు డోర్లు తీసుకొని బయటకు వచ్చి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వాన ఎక్కువగా కురిసిన ప్రాంతాల్లో పత్తి చేనుల్లో నీళ్లు నిలిచిపోయాయి. యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు రుద్రవెల్లి వద్ద మూసీ వరద ఉధృతిని పరిశీలించారు.

యాదాద్రి, నల్గొండలో ఎక్సెస్..

ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వాన కారణంగా లోటు వర్షపాతం నుంచి యాదాద్రి, నల్గొండ ఎక్సెస్​కు చేరుకున్నాయి. యాదాద్రి జిల్లాలో గురువారం 66.6 మిల్లీ మీటర్ల వాన కురిసింది. జిల్లాలోని ఆత్మకూరు ఎం, మోటకొండూరు, ఆలేరు సహా 9 మండలాల్లో సాధారణాన్ని మంచి వర్షం కురిసింది. 

యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో జూన్​ నుంచి ఈ నెల ఇప్పటివరకు కురియాల్సిన వాన కంటే ఎక్కువగా కురిసింది. సూర్యాపేట జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. హైదరాబాద్​లో కురిసిన వాన కారణంగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో పాటు సిటీలోని చెత్త మొత్తం కొట్టుకొచ్చింది. జిల్లాలోని రుద్రవెల్లి లోలెవల్​బ్రిడ్జి వద్ద చెత్త మొత్తం ఆగిపోయింది.