ఫార్ములా ఈ రేస్.. సిటీలో ఫుల్ ట్రాఫిక్ జాం

ఫార్ములా ఈ రేస్.. సిటీలో ఫుల్ ట్రాఫిక్ జాం

సిటీలో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. ఫార్ములా వన్ రేస్ కారణంగా పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేయడం వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. కొన్ని రూట్లు మూసివేయడంతో రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మసాబ్ ట్యాంక్, అసెంబ్లీ రూట్తో పాటు పంజాగుట్ట, సికింద్రాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మార్గంలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రూట్లో వాహనాలు ముందుకు కదలడం లేదు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు.

ఫార్ములా ఈ రేసింగ్ కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా ఖైరతాబాద్ క్రాస్ రోడ్స్, షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, టెలిఫోన్ భవన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు మార్గంలో రద్దీ నెలకొందని ప్రకటించారు. మరోవైపు దారి మళ్లింపు కారణంగా సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్, మహావీర్ హాస్పిటల్, అయోధ్య జంక్షన్, నిరంకారీ నుంచి షాదాన్ వైపు వెళ్లే వాహనాలు మూమెంట్ స్లోగా ఉంటుందని చెప్పారు. ఈ మార్గాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని  పోలీసులు సూచించారు. సైఫాబాద్, ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రద్దీని క్రమబద్దీకరిస్తారని ప్రకటించారు.