
నదీ ప్రవాహ మార్గాలు హద్దులు (గట్లు) దాటి జల ప్రవాహం నిలువరించ లేకపోవడంవల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు వర్షపాతం ఉండడం వల్ల ఏదో ఒక ప్రాంతంలో అనూహ్యమైన వరదలు సంభవిస్తున్నాయి. అధిక వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఉంటుంది.ఈ కాలంలో వరదలు సంభవించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
తుపాన్లు, వాయుగుండం. అధిక వర్షపాతం, ఉష్ణోగ్రతలో మార్పులు ' మంచు కరగడం సునామీల వల్ల వరదలు వస్తాయి. మన దేశంలో సుమారు 3,290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భూమి వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది అని అంచనాలు తెలుపుతున్నాయి. ప్రతి ఏటా దాదాపు78లక్షల హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురి అవుతుంది. ఏటా దాదాపు 1700 మందికిపైగా వరదల వల్ల మరణిస్తున్నారు.
కోట్ల రూపాయల ఆస్తి పంట నష్టం జరుగుతుందని. ఇండ్లు, రోడ్లు, జాతీయ రహదారులు, వంతెనలు, కాలువలు దెబ్బతింటున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నదీతీర ప్రాంతాలలో తరచుగా వరదలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రజలను వరదలు రావడానికి ముందుగానే తరలించాలి. వారికి పునరావాస సౌకర్యాలు కల్పించాలి. దీనివల్ల వరదల సమయంలో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
వైద్య ఆరోగ్య సౌకర్యాలను ముందస్తుగానే సమకూర్చుకోవాలి. వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నీటిని బ్లీచింగ్ పౌడర్ చే శుభ్రపరచాలి. తెగిపడిన విద్యుత్తు తీగలను తాకరాదు. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, దుస్తులు, మందులు దగ్గర ఉంచుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో పశువులు వ్యవసాయ సామగ్రి, ఇతర సామగ్రి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చెయ్యాలి.
నేదునూరి కనకయ్య