కంటెంట్ ఉన్నవాళ్లే స్ట్రాంగ్

కంటెంట్ ఉన్నవాళ్లే స్ట్రాంగ్

రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్‌‌కు వస్తుండటం ఎక్సైటింగ్‌‌గా ఉందంటున్నాడు నాని. తను హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాని ఇలా ముచ్చటించాడు. 

ఏదో పీరియాడికల్ సెటప్ క్రియేట్ చేద్దామని కాకుండా కథలో దమ్ము ఉంటేనే ఇలాంటి సినిమా చేయాలి. ఎందుకంటే బడ్జెట్‌‌తో సహా చాలా విషయాల్లో ఇది రిస్క్. అద్భుతమైన కథ దొరికినప్పుడే ఆ రిస్క్ చేయగలం. ఈ సినిమాకి అలాంటి కథ దొరికింది. అలాగని కథ, యాక్టర్స్ ఉంటే సరిపోదు. మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. ప్రేక్షకులు తెరపై ఆ సీన్స్ చూసేటప్పుడు ఏదో సెట్స్ వేసి తీశారు అని కాకుండా అప్పటి ప్రపంచంలోకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది.  

దేవదాసీ వ్యవస్థతో సహా పలు దురాచారాలపై పోరాడే కమ్యూనిస్ట్ శ్యామ్ సింగ రాయ్ ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఎవరి లైఫ్‌‌ స్టోరీ కాదు. పూర్తిగా ఫిక్షనల్. అతని నాన్న బెంగాలీ, అమ్మ తెలుగు. అందుకే ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాడు. కానీ అక్కడక్కడా బెంగాలీ లేకపోతే అథెంటిక్‌‌గా అనిపించదని కొన్ని డైలాగ్స్ బెంగాలీలోనే పెట్టాం. ఇందులో నాలుగు ఎపిసోడ్స్ హైలైట్‌‌. కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయవి.

రాయ్ పాత్ర కోసం బరువు పెరిగానని అంతా అంటున్నారు. అదేమీ లేదు. బాడీ లాంగ్వేజ్‌‌ని మార్చితే మరో మనిషిని చూసిన ఫీలింగ్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. బెంగాలీ బ్యాక్‌‌డ్రాప్‌‌ కోసం నేను పెట్టిన ఎఫర్ట్ కంటే మిగతా  డిపార్ట్‌‌మెంట్స్ పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ. జూనియర్ ఆర్టిస్టుల్ని కూడా ఆడిషన్స్ చేసే తీసుకున్నారు. వారికి కూడా స్పెషల్ క్యాస్మ్స్ డిజైన్ చేశారు. 

నా కెరీర్‌‌లో ఎప్పుడే సినిమా చేసినా అప్పటి వరకు అదే హయ్యెస్ట్ బడ్జెట్. ఇదీ అంతే. గ్రోత్ అలా పెరుగుతూ వచ్చింది. వరుస సినిమాలున్నాయి కనుక గట్టిగా ప్రమోట్ చేస్తున్నాం. ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వరకే.  అయినా సినిమా ఎలా వచ్చిందో తెలుసు కనుక కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం. ‘ఈగ’తో సౌత్ అంతా పాపులర్ అయ్యాను. ఎక్కడికెళ్లినా నాని మా హీరోనే అంటున్నారు. 

రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్​కి వస్తుండడం ఎక్సైటింగ్‌‌గా ఉంది. మరో ఆప్షన్ లేక వి, టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. రెండూ సక్సెస్ అయ్యాయి. కానీ ఓటీటీలో కనుక లెక్కలు చూపించలేకపోతున్నాం. నిర్మాతలతో పాటు అమెజాన్ ప్రైమ్‌‌ కూడా హ్యాపీగా ఉంది. ‘అంటే సుందరానికీ’ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్‌‌లో ఉంది. ఏప్రిల్‌‌లో రావొచ్చు. ‘దసరా’ చిత్రం షూటింగ్ త్వరలోనే స్టార్టవుతుంది. ఇందులో తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. తెలుగులో ఇప్పటి వరకు టచ్ చేయని కలర్, జానర్‌‌లో ఉంటుంది. మరీ పాతకాలం కాదు కానీ ఓ పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లే కథ. 

నా నెక్స్ట్ రెండు సినిమాలూ నాలుగు సౌత్ లాంగ్వేజెస్‌‌లో రిలీజవుతాయి. హిందీకి సెట్టయ్యే స్టోరీలైతేనే అక్కడ రిలీజ్ చేస్తాం. నిజానికి ‘జెర్సీ’ ప్యాన్ ఇండియా స్థాయిలో చేయాల్సింది. ఆలోచన రాలేదు. ‘టక్ జగదీష్’ తెలుగు నేటివిటీ సినిమా కనుక ఇతర భాషల్లో రిలీజ్ చేయలేదు. ఓటీటీ వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి భాషలోని సినిమాల్నీ చూస్తున్నాం. కంటెంట్ ఉన్నవాళ్లే స్ట్రాంగ్. మనం కష్టపడి ఓ కథను ప్యాన్ ఇండియాగా చేయాల్సిన పని లేదు. కథే ప్యాన్ ఇండియా అవుతుంది.

‘ఎంసీఏ’లో నేను, సాయిపల్లవి మా రియల్‌‌ లైఫ్‌‌లో ఉన్నట్టుగానే కనిపించాం. మళ్లీ కలిసి నటిస్తే ఈ ప్రపంచానికి దూరంగా ఉండే పాత్రలు చేయాలని అప్పుడే అనుకున్నాం. ఈ సినిమాతో ఆ చాన్స్ దొరికింది. దాంతో మా బాధ్యత పెరిగింది. ముఖ్యంగా సాయిపల్లవి ఎక్కువ బరువు మోస్తోంది. కృతీశెట్టికి నేర్చుకోవాలనే తపన ఉంది. ప్రతి విషయాన్నీ రాహుల్‌‌ని, నన్నూ అడుగుతూ ఉండేది. అలాంటి క్వాలిటీ ఉండటం చాలా మంచిది. ‘జెర్సీ’ తరువాత ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. దర్శకులిద్దరిలోనూ ఒకే క్వాలిటీస్ చూశాను. వయసుకు మించిన మెచ్యూరిటీ వాళ్లది. ప్రతిదీ డిటెయిల్డ్‌‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. లిటరేచర్‌‌‌‌పై గ్రిప్‌‌ ఉన్న ఇలాంటివాళ్లు పీరియాడికల్ ఫిల్మ్‌‌ తీస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.