 
                                    బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడు పెంచుతున్నాడు విశ్వక్ సేన్. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగా తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసినట్టు సమాచారం. శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’, రీతూ వర్మతో ‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్ తెరకెక్కించిన కిషోర్ రెడ్డి దర్శకత్వంలో విశ్వక్ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే కిషోర్ చెప్పిన స్టోరీలైన్‌కు విశ్వక్ సేన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో విశ్వక్ సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తీసిన సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం అనుదీప్ డైరెక్షన్‌లో ‘ఫంకీ’ సినిమా చేస్తున్న విశ్వక్.. మరోవైపు తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో ‘ఈ నగరానికి ఏమైంది 2’లో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘ఫంకీ’ 2025 క్రిస్మస్‌కు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక కిషోర్ డైరెక్షన్‌లో సినిమా మొదలవనుంది.
శ్రీకారం మూవీ:
యువత రైతుగా మారితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందనే మంచి పాయింట్తో శ్రీకారం మూవీ చేశారు డైరెక్టర్ కిషోర్. మనసును తాకే అంశాలతో పాటుగా ఎమోషనల్ సీన్స్ తో మెప్పించాడు. ‘ఎద్దేడ్చిన ఎవుసం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు’ అని పెద్దలు చెబుతుంటారు. వ్యవసాయం అనే మాటలోనే వ్యయం ఉంది, సాయం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యయం పెరిగిపోయి రైతు వ్యవసాయం చేసే పరిస్థితి దేశంలోని చాలా ప్రాంతాల్లో లేదు. ఎందుకంటే అవసరమైన సాయం అందడం లేదు. ఇలాంటి టైంలో వ్యవసాయంపై సినిమా తీసి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ కిషోర్. ఇపుడు విశ్వక్ సేన్ తో.. ఎలాంటి కాన్సెప్ట్ ద్వారా మెసేజ్ ఇవ్వనున్నాడో తెలియాల్సి ఉంది.

 
         
                     
                     
                    